వ్యాక్సిన్ డ్రై రన్ ఏర్పట్లపై మంత్రి ఈటల చర్చ..

181
minister etela
- Advertisement -

కరోనా వైరస్‌ను నివారించేందుకు భారత దేశ వ్యాప్తంగా జనవరి 8న వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు, లోటుపాట్లపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డ్రై రన్ నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు. సాఫ్ట్‌వేర్ పని చేస్తున్న తీరు, వ్యాక్సిన్‌ను నిల్వ చేయడానికి అవసరమైన కోల్డ్ స్టోరేజ్, రవాణా చేయడానికి అవసరమైన కోల్డ్ చైన్, బెనిఫిషియరీ ఎన్రోల్మెంట్‌పై సుదీర్ఘంగా చర్చించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ మంత్రుల అభిప్రాయాలు తీసుకున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో సాఫ్ట్‌వేర్ సమస్యలు ఉన్నట్లుగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి తెలియజేశారు. 14 జిల్లాల్లో వాక్సిన్ లబ్ధిదారులను ఎన్రోల్ చేయడానికి సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. స్పందించిన కేంద్ర మంత్రి ఈరోజు సాయంత్రం లోపు దీనికి పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు ఇస్తున్న మార్గదర్శకాలను పాటిస్తున్నామని మంత్రి ఈటల తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలోనే వ్యాక్సిన్ తయారు అవుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి ఎక్కువ డోసుల వ్యాక్సిన్ అందజేయాలని మరో మారు కేంద్ర మంత్రిని ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం హెల్త్కేర్ వర్కర్లకు మాత్రమే ఇస్తున్నారు, కరోనా వ్యాప్తిని అరికట్టడానికి, చికిత్స అందించడానికి ముందువరుసలో ఉండి పని చేసిన పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపల్ వర్కర్లు, పోలీసులు కూడా అతి త్వరగా వాక్సిన్ అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. యాభై సంవత్సరాల పైబడిన వారు, వనరబుల్ గ్రూప్‌లో ఉన్నవారందరికీ అతి త్వరలో వాక్సిన్ అందించాలని కోరారు.

కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో పాటు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస రావు, కరోనా నిపుణుల కమిటీ సభ్యులు డాక్టర్‌ గంగాధర్, డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధి పుట్ట రాజు, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నుండి మనీష్ హాజరయ్యారు.

- Advertisement -