కోవిడ్ వ్యాక్సినేషన్‌లో చరిత్ర సృష్టించిన భారత్..

79

కరోనా మహమ్మారి కట్టడి కోసం దేశవ్యా‍ప్తంగా టీకా పంపిణీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 16న ప్రారంభమైన టీకా కార్యక్రమం నేటికి 100 కోట్ల డోసుల మైలు రాయికి చేరుకుని చరిత్ర సృష్టించింది. చైనా తర్వాత 100 కోట్ల డోసులు అందించిన రెండో దేశంగా భారత్‌ నిలిచింది. కరోనా వైరస్‌ కట్టడిలో భారత్ గొప్ప ఘనత సృష్టించిందని ప్రభుత్వం పేర్కొంది. ఇది అమెరికాలో ఇచ్చిన వ్యాక్సిన్ డోసుల కన్నా రెట్టింపు, జపాన్‌లో కన్నా ఐదు రెట్లు, జర్మనీలో కన్నా తొమ్మిది రెట్లు, ఫ్రాన్స్‌లో కన్నా 10 రెట్లు అధికం.

దేశ జనాభాలో వ్యాక్సిన్‌ తీసుకునేందుకు అర్హులైనవారిలో 75 శాతం మంది కోవిడ్-19 వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జమ్మూ-కశ్మీరు, లడఖ్, ఉత్తరాఖండ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ, గోవా, లక్షద్వీప్ నూటికి నూరు శాతం తొలి డోస్ వ్యాక్సినేషన్ జరిగినట్లు తెలిపింది. నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అర్హులైనవారిలో 90 శాతం మందికి తొలి డోసు వ్యాక్సినేషన్ జరిగినట్లు పేర్కొంది.

ఈ చరిత్రాత్మక ఘనత సాధించేందుకు మన దేశానికి 9 నెలలు పట్టింది. ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఓ పాటను ఆవిష్కరించడంతోపాటు ఢిల్లీలోని ఎర్ర కోట వద్ద అతి పెద్ద జాతీయ జెండాను ఎగురవేయాలని నిర్ణయించింది. 2021 జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. దేశంలోని మారుమూల ప్రాంతాలకు వ్యాక్సిన్లను సరఫరా చేయడం కోసం డ్రోన్లను కూడా ఉపయోగించడం విశేషం.

ఈ సందర్భంగా భార‌త్‌కు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ అధ‌న‌మ్ శుభాకాంక్ష‌లు తెలిపారు. క‌రోనా వైర‌స్ నుంచి ప్ర‌జ‌లు, అణ‌గారిన వ‌ర్గాల‌ను కాపాడ‌టంలో భార‌త ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు, శాస్త్ర‌వేత్త‌లు, ప్ర‌జ‌లు సాగించిన కృషి ప్ర‌శంస‌నీయ‌మ‌ని అన్నారు.

ఇక వంద కోట్ల టీకా డోసుల పంపిణీతో భార‌త్ చ‌రిత్ర సృష్టించింద‌ని ప్ర‌ధాని మోదీ ట్వీట్ చేశారు.. భార‌త సైంటిస్టులు, స‌మ‌ర్ధ నిర్వ‌హ‌ణ‌తో పాటు 130 కోట్ల మంది భార‌తీయుల స్పూర్తికి ఇది సంకేత‌మ‌ని పేర్కొన్నారు.. ఈ అద్భుత ఘ‌న‌త సాధించేందుకు కృషి చేసిన డాక్ట‌ర్లు, న‌ర్సులు, అంద‌రికీ ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.