షర్మిల పార్టీలోకి బీజేపీ మహిళా మోర్చా కీలక నేత..!

133
sharmila
- Advertisement -

దివంగత నేత వైఎస్ఆర్ కుమార్తె వైఎస్ షర్మిల జోరు పెంచింది. ఏప్రిల్ 9 న ఖమ్మంలో సంకల్పసభ పేరుతో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో కొత్త పార్టీ ఏర్పాటు ప్రకటన చేయబోతుంది. అయితే తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చుతున్న వేళ షర్మిల సభకు ఇచ్చిన అనుమతులను పోలీసులు రద్దు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా తెలంగాణలో రాజకీయ నిరుద్యోగులు, ఆంధ్రా నేతల మోచేతినీళ్లకు అలవాటు పడిన బానిస నేతలు పోలోమంటూ లోటస్‌పాండ్‌కు వెళ్లి ఆంధ్రా అక్క షర్మిలకు మోకరిల్లుతున్నారు. గత కొద్దిరోజులుగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదనుకున్న నాయకులు షర్మిల గూటికి చేరుకుంటున్నారు. మరోవైపు వైఎస్ఆర్‌ను అభిమానించే కాంగ్రెస్ పార్టీ కీలక నేతలకు షర్మిల స్వయంగా ఫోన్ చేసి తన కొత్త పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఇప్పటికే ఇందిరాశోభన్, ఏపూరి సోమన్న, గ్రేటర్ హైదరాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షురాలు అచ్చుతాయాదవ్ షర్మిల పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. త్వరలో మరికొంత మంది కాంగ్రెస్ నాయకులు షర్మిల గూటికి చేరుకోవడం ఖాయమని హస్తం పార్టీలో చర్చ జరుగుతోంది.

అయితే తెలంగాణలో బీజేపీ రోజు రోజుకీ బలపడుతూ, అధికార టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుండడంతో షర్మిల కమలం పార్టీపై కన్నేసింది. పార్టీ ఇంకా పుట్టకముందే వచ్చే ఎన్నికల్లో మనదే అధికారం, నేనే సీఎం అంటూ ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రదర్శిస్తున్న షర్మిల ఇప్పుడు బీజేపీని టార్గెట్ చేస్తోంది. తాజాగా బీజేపీ మహిళా మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్, కాషాయపార్టీలో కీలక నేత అయిన సంగీతారెడ్డితో పాటు గొల్ల కురుమ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కడారి స్టాలిన్ యాదవ్ లోటస్ పాండ్‌లో షర్మిలను కలిసి మద్దతు ప్రకటించారు. షర్మిలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని, ఖమ్మంలో నిర్వహిస్తున్న సంకల్ప సభను విజయవంతం చేసేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు. కాగా షర్మిల కమలం విడిచిన బాణమే అని , ఆమె పార్టీ వెనుక ముందు కాంగ్రెస్‌ను, ఆ తర్వాత టీఆర్ఎస్‌‌ను దెబ్బతీయాలన్న ఢిల్లీ బీజేపీ పెద్దల వ్యూహం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే షర్మిల ఇప్పుడు తమ పార్టీ నేతలనే టార్గెట్ చేయడం కమలనాధులకు షాక్ ఇస్తోంది. ఇదిలా ఉంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయంతొ బీజేపీ డిఫెన్స్‌లో పడింది. ఇప్పుడు జరగబోతున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో కూడా బీజేపీకి గెలిచే సీన్ కలిపించడంలేదు. ఈ నేపథ్యంలో ఇంత కాలం బీజేపీ వచ్చేసారి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీలో చేరిన నేతలు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు.

అందుకే ఇప్పుడు కమలం పార్టీ నుంచి రివర్స్‌లో ఇతర పార్టీలలోకి వలసలు షురూ అయ్యాయి. ఇటీవల సాగర్ టికెట్ ఆశించి భంగపడ్డ బీజేపీ కీలక నేత కడారి అంజయ్యయాదవ్ తన వందలాది మంది అనుచరులతో టీఆర్ఎస్‌లో చేరారు. ఇప్పుడు ఏకంగా బీజేపీ కీలక నేత,మహిళామోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ సంగీతాయాదవ్ షర్మిల పార్టీలో చేరడం బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు షాకింగ్‌గా మారింది. సాగర్ ఉప ఎన్నికలలో ఘోరపరాజయం తర్వాత బీజేపీ బుగడ పేలిపోతుందని, ఆ పార్టీ నుంచి కీలక నేతలంతా బండికి హ్యాండ్ ఇచ్చి…ఇతర పార్టీలలో చేరడం ఖాయమని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. అసలే సాగర్ ఉప ఎన్నికలలో ఓటమి తప్పదని భయపడుతున్న బండి సంజయ్‌కు ఇలా తమ పార్టీ నుంచి రివర్స్‌లో వలసలు ఊపందుకోవడంతో ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకున్నట్లు సమాచారం. మొత్తంగా బీజేపీ కీలక నేత, రాష్ట్ర మహిళామోర్చా కార్యనిర్వాహక సభ్యురాలు సంగీతాయాదవ్ షర్మిలను కలిసి మద్దతు ప్రకటించడం కాషాయ పార్టీలో కలకలం రేపుతోంది.

- Advertisement -