ఖైదీకి..పవన్‌, రోజా విషెస్‌

139
khaidi

30 ఏళ్లపాటు టాలీవుడ్ ఇండస్ట్ర్రీని షేక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం.150 సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తుండడంతో..సినీ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రిలీజ్ కు టైం దగ్గరపడుతుండడంతో విషెస్ తెలియజేస్తున్నారు. చిరు 150వ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’ సినిమా పట్ల పవన్ కల్యాణ్ స్పందించారు. “చరణ్, మా వదిన సురేఖ గారి నిర్మాణంలో వస్తున్న తొలి చిత్రమే చిరంజీవి గారి 150వ చిత్రం కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఖైదీ నంబర్ 150 ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నాను. ఈ చిత్రంలోని నటీనటులకు, సాంకేతిక నిపుణులకు నా మన:పూర్వక శుభాకాంక్షలు”, అంటూ పవన్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. శనివారం నిర్వహించనున్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు పవన్ కూడా హాజరుకానున్నట్టు తెలుస్తోంది.

అప్పట్లో చిరంజీవితో కలిసి చిందేసిన అలనాటి స్టార్ హీరోయిన్..ఎమ్మెల్యే రోజా ఖైదీ సినిమాపై స్పందించారు. చిరంజీవి అన‌గానే ముందుగా గుర్తొచ్చేది ఆయ‌న చేసే డ్యాన్సేన‌ని ఆమె అన్నారు. ఆయ‌న 9 ఏళ్ల త‌రువాత మ‌ళ్లీ రావ‌డం అంద‌రికీ సంతోషాన్నిస్తోందని చెప్పారు. ఆయ‌న చేసే ఫైట్స్ కూడా అద్భుతంగా ఉంటాయ‌ని చెప్పారు. తాను ఆయ‌న‌తో క‌లిసి ముఠామేస్త్రీ, ముగ్గురు మొన‌గాళ్లు, బిగ్‌బాస్ సినిమాల్లో న‌టించాన‌ని అన్నారు. ఆయ‌న‌తో క‌లిసి వ‌ర్క్ చేసేట‌ప్పుడు డ్యాన్స్ చేసేట‌ప్పుడు చాలా కాంపిటీష‌న్‌గా అనిపించేద‌ని, ఆయ‌న‌తో చేసిన ప‌లు సాంగ్స్ చాలా హిట్ అయ్యాయ‌ని అన్నారు.

khaidi

‘ఖైదీ’ సినిమా ఎంత పేరు తీసుకొచ్చిందో… ఈ సినిమా కూడా చిరంజీవికి అంత‌ే పేరు తీసుకురావాల‌ని తాను మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్న‌ట్లు రోజా తెలిపారు. త‌న‌కు ఆయ‌న సినిమాల్లో బాగా న‌చ్చిన సినిమా విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ‘ఆప‌ద్బాంధ‌వుడు’ అని ఆమె చెప్పారు. క‌మ‌ర్షియ‌ల్ సినిమాలే కాకుండా మంచి సినిమాలు చేసి జాతీయ అవార్డులు పొందార‌ని అన్నారు. రాజకీయాల్లో విమర్శనాస్త్రాలు సందించిన రోజా..సినిమా పరంగా చిరుకు అండగా నిలబడడంతో..స్నేహాపూర్వక వాతావరణం కల్పించినట్టైందని ప్రేక్షకులు అనుకుంటున్నారు.