తొలి రోజు 1.91 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్..

284
vaccination
- Advertisement -

భారత్ లో ఇవాళ తొలి దశ కరోనా వ్యాక్సినేషన్ విజయవంతం అయిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎవరూ అనారోగ్యానికి గురికాలేదని తెలిపింది. తొలిరోజు 1.91 లక్షల మందికి పైగా కరోనా వ్యాక్సిన్ అందించినట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వివరించింది. దేశవ్యాప్తంగా 3,351 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టగా 16,755 మంది సిబ్బంది పాల్గొన్నారని పేర్కొంది. తొలి రోజు వ్యాక్సినేషన్‌లో పాల్గొన్న వారు ఎవరూ కూడా టీకా అనంతరం ఆసుపత్రుల్లో చేరిన సంఘటనలు లేవని పేర్కొంది.

సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కోవిషీల్డ్‌ను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సరఫరా చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌ 12 రాష్ట్రాలకు సరఫరా అయ్యినట్లు చెప్పింది. శనివారం దేశవ్యాప్తంగా 3,351 వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో ఈ రెండు టీకాలను వేసినట్లు వెల్లడించింది. మరోవైపు తొలి రోజు టీకా వేయించుకున్న వారిలో ప్రతికూలతలను పరిశీలించేందుకు ఆదివారం కరోనా టీకా డ్రైవ్‌ చేపట్టబోమని కొన్ని రాష్ట్రాలు ప్రకటించాయి.

కాగా, ఏపీలో కొవిన్ యాప్ లో సాంకేతిక సమస్యలతో పలు ప్రాంతాల్లో ఆలస్యంగా వ్యాక్సినేషన్ నిర్వహించినట్టు తెలిసింది. సాయంత్రం 6 గంటల వరకు 16,963 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. 332 కేంద్రాల ద్వారా 32,739 మందికి వ్యాక్సిన్ అందించాలనేది తమ లక్ష్యమని, అనుకున్న లక్ష్యాన్ని పూర్తిచేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇవాళ అత్యధికంగా గుంటూరు జిల్లాలో 2,274 మందికి వ్యాక్సినేషన్ చేయగా, అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 436 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.

- Advertisement -