గవర్నర్ పర్యటనపై మంత్రి సబితారెడ్డి సమీక్ష..

38
Minister Sabitha

గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ మహేశ్వరం మండల పరిధిలోని కెసి తాండలో ఈ నెల 12న పర్యటించనున్న సందర్భంగా ఏర్పాట్లపై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్షించారు. గవర్నర్ పి ఎస్ రఘు ప్రసాద్, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్,అడిషనల్ కలెక్టర్ ప్రతిక్ జైన్,జిల్లా వైద్యాధికారి స్వరాజ్య లక్ష్మి,పోలీస్,ఇతర శాఖ అధికారులతో శనివారం మంత్రి మహేశ్వరం అతిధి గృహంలో సమీక్ష నిర్వహించారు. గిరిజనులతో కలిసి గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ వాక్సిన్ తీసుకోనుండటం సందర్భంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

గిరిజనులలో కోవిడ్‌పై ఉన్న అపోహలు తొలిగించటానికి.. వ్యాక్సినేషన్ శాతాన్ని పెంచడానికి గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం రోజు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని కెసి తండాలో గిరిజనులతో కలిసి వ్యాక్సిన్ తీసుకోనున్నారు. గవర్నర్ మొదటి టీకా డోస్‌ను ఇంతకుముందే పుదుచ్చేరి ప్రభుత్వ ఆస్పత్రిలో తీసుకోగా, రెండవ డోస్ సోమవారం నాడు తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూసుకోవాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్, వైద్య శాఖ,పంచాయతీ రాజ్,ట్రాన్స్కో తదితర శాఖల వారు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.ఈ సందర్భంగా గవర్నర్ శివ గంగ ఆలయానికి వస్తున్నందున ఆ దిశగా కూడా దృష్టి పెట్టాలని మంత్రి అధికారులకు సూచించారు.