హైదరాబాద్‌కు భారీగా నిధులు.. కేటీఆర్ ధన్యవాదాలు..

581
ktr
- Advertisement -

హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చాలన్న తెలంగాణ ప్రభుత్వ నిబద్ధతకు మరింత బలం చేకూర్చే విధంగా ఈరోజు బడ్జెట్‌లో ప్రత్యేకంగా భారీగా నిధులు కేటాయించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావుకి మరియు ప్రభుత్వానికి పురపాలక శాఖ మంత్రి కే . తారకరామారావు హైదరాబాద్ మరియు పరిసర పట్టణాల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాటి నుంచి హైదరాబాద్ నగర విస్తరణ దాని భవిష్యత్తు పైన స్పష్టమైన ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం కృషి చేస్తూ వస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.

ఇందులో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే శాంతిభద్రతల సమస్య పైన ప్రధాన దృష్టి సారించిన ముఖ్యమంత్రి పోలీసు యంత్రాంగానికి ఆధునిక వసతులతో పాటు పెద్ద ఎత్తున నిధులను అందించిన విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ఆ తర్వాత కాలంలోనూ హైదరాబాద్ నగరానికి సంబంధించి జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఎస్ ఆర్ డి పి లాంటి ప్రత్యేక కార్యక్రమాలతో మౌలిక వసతుల కోసం పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తూ వచ్చామన్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించే విధంగా ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లను ప్రజల ఉపయోగంలోకి తీసుకు వచ్చామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవతో మెట్రో రైల్ ప్రాజెక్ట్ ని పూర్తి చేయగలిగమన్న మంత్రి కేటీఆర్, రెండవ దశ మెట్రో రైల్ కోసం వేగంగా ప్రణాళికలు కొనసాగుతున్నాయని, ప్రభుత్వ సహకారంతో అవి త్వరలోనే కార్యరూపం దాలుస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

ప్రస్తుతం హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం చేపట్టాల్సిన మౌలిక వసతుల ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రస్తుత బడ్జెట్లో కేటాయించిన పది వేల కోట్ల రూపాయల నిధుల కేటాయింపు ద్వారా నగర అభివృద్ధికి మరింత వేగవంతం అవుతుందన్నారు. దీంతో పాటు రానున్న నాలుగు సంవత్సరాల పాటు ప్రతి ఏడాది పది వేల కోట్ల రూపాయల చొప్పున మొత్తంగా 50 వేల కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం కేటాయించనున్న నేపథ్యంలో హైదరాబాద్ విశ్వనగర రూపు సంతరించుకుంటుందన్న విశ్వాసాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు.

ఇప్పటికే ప్రపంచం అబ్బుర పడేలా తనదైన నిబద్ధత, నాయకత్వంతో కాళేశ్వరం లాంటి అతి భారీ ప్రాజెక్టులను స్వల్ప కాలంలో పూర్తి చేసిన ముఖ్యమంత్రి నాయకత్వంలో హైదరాబాద్ విశ్వనగరం స్థాయికి చేరుకునే దిశగా వేగంగా ముందుకు పోతుందన్న ఆశాభావాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక ప్రపంచ స్థాయి కంపెనీల దృష్టిని ఆకర్షించిన హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ప్రభుత్వం ఆలోచిస్తున్న మౌలిక వసతులు, ఇతర సౌకర్యాల కల్పన తర్వాత కచ్చితంగా ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా నిలుస్తుందని… ఆ దిశగా తమ ఈ ప్రయత్నాన్ని నిరంతరం కొనసాగిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

- Advertisement -