తెలంగాణ వ్యాప్తంగా కరోనా వైరస్ కట్టడిలోనే ఉంది. ఒక్క హైదరాబాద్ మినహా మిగతా జిల్లాలు, పల్లెలు పచ్చగా ఉన్నాయి. మంచినీటికి కూడా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడటం లేదు. సీఎం కెసిఆర్ గారి కలల ప్రాజెక్టు మిషన్ భగీరథ ద్వారా అందిస్తున్న స్వచ్ఛమైన మంచినీరు నల్లాల ద్వారా ఇంటింటికీ నిరంతరం అందుతున్నాయి. అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కేంద్ర జలశక్తి అభియాన్ మంత్రి రతన్ లాల్ కటారియా సోమవారం మధ్యాహ్నం మన రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లికి ఫోన్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని కరోనా వైరస్ స్థితిగతులు, తాజా పరిస్థితులు, ఎర్రటి ఎండా కాలంలో మంచినీటి వసతులపై ఆరా తీశారు.
మీ రాష్ట్రంలో కరోనా వైరస్ తాజా పరిస్థితి ఏంటి? కరోనా ప్రభావం ఎలా ఉంది? ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మంచినీటి వసతులు బాగున్నాయా? అంటూ కేంద్ర మంత్రి రతన్ లాల్ కటారియా మన తెలంగాణ మంత్రి దయాకర్ రావుని ప్రశ్నించారు. ఆయా ప్రశ్నలకు సమాధానంగా మంత్రి ఎర్రబెల్లి సమాధానమిచ్చారు. దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ సీఎం కెసిఆర్ లాక్ డౌన్ విధించారని, పగలంతా పకడ్బందీగా లాక్ డౌన్ విధిస్తూనే, రాత్రిళ్ళు కర్ఫ్యూని విధిస్తున్నామని చెప్పారు. దీంతో కరోనా కట్టడిలోకి వచ్చిందన్నారు. అయితే హైదరాబాద్ ఒక్క నగరంలోనే ప్రస్తుతం 40 కి కొద్ది అటు ఇటుగా కేసులు నమోదు అవుతున్నాయన్నారు. గ్రామాల్లో, జిల్లాల్లో దాదాపు కేసులు లేవన్నారు. దీంతో హైదరాబాద్ లోని కొన్ని చోట్ల మాత్రమే రెడ్ జోన్లుగా ఏర్పాటు చేశామని, జిల్లాలు, గ్రామాల్లో ఆరెంజ్, గ్రీన్ జోన్లుగానే ఉన్నాయన్నారు. రెడ్ జోన్లలో కంటైన్మెంట్ ని కూడా నిర్వహిస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి, కేంద్ర మంత్రి కటారియాకు వివరించారు.
అలాగే, రాష్ట్రంలో పేద ప్రజలకు 12కిలోల బియ్యం, రూ.1500 ఆర్థిక సాయం, వలస కూలీలను ఆదుకోవడం వారికి కూడా బియ్యం, నగదు పంపిణీ చేయడం జరిగిందన్నారు. నిత్యావసర సరుకుల కొరత లేకుండా, వాటి ధరలు కూడా అదుపులో ఉండేట్లు, కూరగాయలు ప్రజలకుఅందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర మంత్రి వివరించారు.
వందకు వంద శాతం మిషన్ భగీరథ మంచినీరు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజంలదరికీ ఇంటింటికీ నల్లాల ద్వారా మంచినీరు అందుతున్నదని మంత్రి ఎర్రబెల్లి కేంద్ర మంత్రికి చెప్పారు. ఈ ఎండా కాలం తీవ్ర సీజన్ లోనూ మంచినీటికి ఎలాంటి కొరత రాకుండా చూస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో స్వచ్ఛమైన, భూ ఉపరితల నీటిని సరఫరా చేస్తున్నామని మంత్రి వివరించారు. మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా కరోనా కట్టడి చేయడంలో ఆర్థివ వ్యవస్థని సైతం పక్కన పెట్టి, ప్రజల ప్రాణాలే ముఖ్యమని, మా ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్న చర్యలన్నీ సత్ఫలితాలిస్తున్నాయన్నారు. కరోనా కట్టడిలో తెలంగాణ సీఎం కెసిఆర్ దేశంలోనే నెంబర్ వన్ గా నిలుస్తున్నారని ఎర్రబెల్లి కేంద్ర మంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రతన్ లాల్ కటారియా మాట్లాడుతూ, ఈ విషయాలు తాము కూడా విన్నామని, ఎప్పటికప్పుడు దేశ పరిస్థితిని తెలుసుకుంటున్నామ ని, అందులో భాగంగానే తెలంగాణ వివరాలు అడిగామని చెప్పారు. అలాగే, తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంతోపాటు, కరోనా కట్టడిదలోనూ ముందే ఉండటం గొప్ప విషయమని, కేంద్ర మంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని, సిఎం కెసిఆర్ ని అభినందించారు.