బుర్జ్‌ ఖలీఫా తెరపై తెలంగాణ బతుకమ్మ కనువిందు..

68
Bathukamma

దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ కనువిందు చేసింది. తెలంగాణలో బతుకమ్మ పండగది ప్రత్యేక స్థానం. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటే ఈ పండగను ప్రతి ఏటా దసరాకు ముందు ఘనంగా జరుపుకుంటున్నారు. ఇప్పటికే బతుకమ్మ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. సాధాణంగా దేవుళ్లను పువ్వులతో పూజిస్తారు. కానీ పువ్వులనే పూజించే ఈ ప్రకృతి పండగను విదేశాల్లోనూ జరుపుకుంటున్నారు. బతుకమ్మను ప్రపంచ దేశాలకు పరిచయం చేయడంలో తెలంగాన జాగృతి కీలక భూమిక పోషించింది. తాజాగా మరో అడుగు ముందుకేసిన జాగృతి.. తెలంగాణ బతుకమ్మను విశ్వవేదికపై ప్రదర్శించారు. ప్రపంచంలో అతి ఎత్తైన కట్టడం బుర్జ్ ఖలీఫా పై బతుకమ్మ ప్రదర్శన ఏర్పాటు చేశారు. బతుకమ్మ పండుగపై రూపొందించిన మూడు నిముషాలు నిడివిగల వీడియోను శనివారం రాత్రి 9.30కు, తిరిగి 10.30కు రెండు సార్లు ప్రదర్శించారు.

తెలంగాణ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ వీడియోతో పాటు కేసీఆర్ చిత్రపటం, ‘జై తెలంగాణ’, ‘జై హింద్‌’నినాదాలను బుర్జ్‌ ఖలీఫా తెరపై తెలుగులో ప్రదర్శించారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మ బుర్జ్‌ ఖలీఫా తెరపై కనిపించగానే తెలంగాణ వాసులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు బతుకమ్మ వీడియోను వీక్షించారు.

ఈ సందర్బంగా తెలంగాణ మహిళలతో కలిసి ఎమ్మెల్సీ కవిత బుర్జ్ ఖలీఫా వద్ద బతుకమ్మ ఆడారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మను ప్రదర్శించడం ఒక్క తెలంగాణకే కాదని, మొత్తం దేశానికే గర్వకారణమని అన్నారు. బతుకమ్మ ప్రదర్శనకు సహకరించిన యూఏఈ ప్రభుత్వానికి, బుర్జ్ ఖలీఫా నిర్వాహకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు.