లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నర్సంపేటలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ ఐదేళ్లలో రాష్ట్రానికి కేంద్రం చేసిందేమీ లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మాటలు చెప్పి ఆకట్టుకుంటున్నారు. కానీ పనులు చేయడం లేదన్నారు. పేదోళ్ల ఖాతాల్లో డబ్బులు వేస్తామని కేంద్రం చెప్పింది, కానీ డబ్బులు జమ చేయలేదు.
ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి 150 మించి సీట్లు వచ్చే పరిస్థితి లేదు. బయ్యారం ఉక్కు పరిశ్రమ నేటికి ఇంకా పెండింగ్‌లో ఉన్నది. టీఆర్ఎస్ ఎంపీలు గెలుస్తే ఏం అభివృద్ధి జరుగుతుందని కొందరు అంటున్నారు. 16 ఎంపీ సీట్లలో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే.. మన మాట చెల్లుతుంది. ఢిల్లీ పీఠం మీద ఎవరు ఉండాలో నిర్ణయించేది మనమే అవుతాం. మనకు రావాల్సిన నిధులను సాధించుకుంటాం అని కేటీఆర్ స్పష్టం చేశారు. అలాగే ఏపీ ఎన్నికల్లో గెలుపోటముల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ విజయం ఖాయమని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌లోకి వైయస్ జగన్ వస్తారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ దేశంలో కాంగ్రెస్, బీజేపీ అంటే నచ్చని వాళ్లు చాలామంది ఉన్నారని చెప్పారు. పశ్చిమబెంగాల్లో మమతాబెనర్జీ, ఏపీలో జగన్, ఒడిస్సాలో నవీన్ పట్నాయక్, ఉత్తరప్రదేశ్‌లో మాయావతి, అఖిలేష్ యాదవ్ ఫెడరల్ ఫ్రంట్‌తో కలిసి పనిచేస్తారని కేటీఆర్ చెప్పుకొచ్చారు.