ఇంగ్లాండ్‌కి వెళ్లిన ఇండియా టీమ్‌..

169
Team India

మరికొద్ది రోజులో ఇంగ్లాండ్‌ వేదికగా ప్రారంభంకానున్న వరల్డ్ కప్ క్రికెట్ కోసం భారత జట్టు బయలుదేరి వెళ్లింది. కోహ్లీ నేతృత్వంలోని ఆటగాళ్ల టీమ్, ఈ తెల్లవారుజామున ముంబై ఎయిర్ పోర్టు నుంచి లండన్‌కు పయనం కాగా, విమానాశ్రయంలో వీరు దిగిన ఫోటోలను బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకుంది. గెలుపే లక్ష్యంగా టీమిండియా లండన్ కు బయలుదేరి వెళ్లగా, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Team India

ఇంగ్లాండ్‌ అండ్‌ వేల్స్‌ వేదికగా ఈనెల 30న మెగాటోర్నీ ఆరంభంకానుంది. అంతకుముందు మే 25న న్యూజిలాండ్‌తో తొలి వార్మప్‌ మ్యాచ్‌లో భారత్‌ తలపడనుండగా.. మే 28న బంగ్లాదేశ్‌తో రెండో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడనుంది. విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని భారత్‌ జట్టు జూన్‌ 5న సౌతంప్టన్‌ వేదికగా సౌతాఫ్రికాతో పోరుతో టోర్నీని మొదలుపెట్టనుంది.

ఇంగ్లాండ్‌ బయల్దేరే ముందు కోహ్లీ, కోచ్‌ రవిశాస్త్రి మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘వ్యక్తిగతంగా ఇది నాకు అత్యంత సవాల్‌తో కూడుకున్న ప్రపంచకప్‌ అనిపిస్తోంది. ఏ జట్టు ఏ జట్టుకైనా షాకివ్వొచ్చు. ఫార్మాట్‌ ఇంతకుముందులా లేదు కాబట్టి ప్రతి మ్యాచ్‌లో ఉత్తమ ప్రదర్శన చేయాల్సిందే. ఇదో భిన్నమైన సవాల్‌. దీనికి ఎంత ఎంత వేగంగా అలవాటు పడతామన్నది కీలకం’ అని కోహ్లీ అన్నారు.