పాక్‌ను చిత్తుగా ఓడించిన వెస్టిండీస్‌..

195
West Indies

వరల్డ్‌ కప్‌ను వెస్టిండీస్‌ విజయంతో ప్రారంభించింది. ఇవాళ పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. 36.2 ఓవర్లు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ 21.4 ఓవర్లలో కేవలం 105 పరుగులకే పాకిస్థాన్‌ ఆలౌటైంది. ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హాక్‌ 2 పరుగులకే ఔటయ్యాడు. మంచి జోరు మీద కనిపించిన మరో ఓపెనర్‌ జమన్‌(22: 16 బంతుల్లో 2×4, 1×6).. ఆండ్రీ రసెల్‌ వేసిన ఆరో ఓవర్‌ ఐదో బంతికి బౌల్డయ్యాడు.

West Indies vs Pakistan

ఆ తర్వాత హ్యారిస్‌ సోహైల్‌(8), బాబర్‌ ఆజామ్‌ (22: 33 బంతుల్లో 2×4) కూడా వెంటవెంటనే అవుటవడంతో పాక్‌ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆదుకుంటాడనుకున్న కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ (8) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. ఆ తర్వాత వెనువెంటనే ఇమాద్‌ వసీమ్‌ (1), షాబాద్‌ ఖాన్‌ (0) అవుటయ్యారు. హఫీజ్‌ కూడా 16 పరుగులకు వెనుదిరిగాడు. చివర్లో రియాజ్‌ (18) రెండు సిక్సర్లు, ఓ బౌండరీ బాది స్కోరును 100 దాటించాడు. ఈక్రమంలో థామస్‌ వేసిన 22వ ఓవర్‌ నాలుగో బంతికి రియాజ్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. హోల్డర్‌, థామస్‌ 4, హోల్డర్‌ 3, రసెల్ 2, కాట్రెల్‌ 1 వికెట్‌ పడగొట్టారు.

క్రిస్‌గేల్(50: 34 బంతుల్లో 6ఫోర్లు, 3సిక్సర్లు), నికోలస్ పూరన్(34నాటౌట్: 19 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు) రాణించడంతో కేవలం 13.4 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పాక్ నిర్దేశించిన 106 పరుగుల లక్ష్యాన్ని కరీబియన్ బ్యాట్స్‌మెన్ స్వేచ్ఛగా ఆడుతూ పాడుతూ ఛేదించారు. విండీస్ బ్యాట్స్‌మెన్ జోరును పాక్ బౌలర్లు ఏదశలోనూ కట్టడి చేయలేదు. పాక్ బౌలర్లలో మహ్మద్ ఆమీర్ ఒక్కడే ఆరు ఓవర్లు వేసి మూడు వికెట్లు తీశాడు. వాహబ్ రియాజ్, హసన్ అలీ ధారళంగా పరుగులు ఇచ్చుకున్నారు. టోర్నీలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే పాక్‌పై 7 వికెట్ల తేడాతో భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది విండీస్. ప్రపంచకప్ చరిత్రలో పాక్ దారుణ బ్యాటింగ్ వైఫల్యంతో చెత్తరికార్డులు నమోదు చేసింది.