కాంగ్రెస్, బీజేపీలకు ఇండిపెండెంట్ల షాక్..!

23
bandi sanjay

తెలంగాణలో త్వరలో జరగబోతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. మార్చి 14న ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. మార్చి 17 న కౌంటింగ్ జరగనుంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి, పాలమూరు, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మంగా తీసుకున్నాయి. ముఖ్యంగా వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ స్థానంలో ఈసారి గట్టిపోటీ నెలకొంది. ఇక్కడ గతంలో 2, 81, 138 మంది పట్టభద్రుల ఓట్లు ఉండగా, ఈ సారి అవి 4,92, 943కు పెరిగాయి. దీంతో ఎన్నికలలో భారీగా పోలింగ్ నమోదు అయ్యే అవకాశం ఉండడంతో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎవరికి వారు కొండంత ఆశ పెట్టుకున్నారు.

అధికార టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్ రెడ్డి బరిలో ఉండగా, కాంగ్రెస్ నుంచి రాములు నాయక్, తెలంగాణ జనసమితి నుంచి కోదండరామ్, వామపక్షాల అభ్యర్థిగా విజయసారథిరెడ్డి బరిలో ఉన్నారు. ఇప్పటికే పల్లారాజేశ్వర్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతి 50 ఓటర్లకు ఒక ఇంచార్జిని నియమించి పట్టభద్రులను ఆకట్టుకునేందుకు పల్లా ప్రయత్నిస్తున్నారు. మూడు ఉమ్మడి జిల్లాలలో టీఆర్ఎస్ పార్టీకి యువజన ఓటు బ్యాంకు బలంగా ఉండడంతో గట్టిపోటీ ఉన్నప్పటికీ పల్లా మరోసారి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని టీఆర్ఎస్ వర్గాలు కాన్ఫిడెంట్‌గా ఉన్నాయి. అయితే కాంగ్రెస్ నుంచి అభ్యర్థిగా ఉన్న రాములు నాయక్ స్థానికేతరుడు కావడం ఆయనకు పెద్ద మైనస్. పైగా ఈ పట్టభద్రుల స్థానంపై మొదటి నుంచి ఆశలపెట్టుకుని పని చేసిన బెల్లయ్య నాయక్ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతుండడంతో కాంగ్రెస్‌కు ఇబ్బందిగా మారింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, జానారెడ్డి వంటి నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో గెలవడం కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది.

అయితే అసమ్మతికి తోడు, ప్రచారంలో వెనకబడిపోవడం, ఇండిపెండెంట్లు భారీ సంఖ్యలో పోటీలో ఉండడం ఉత్తమ్‌కు గుబులు పుట్టిస్తోంది. ఇక బీజేపీ పరిస్థితి కూడా అదే..గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో రెండో స్థానంలో నిలిచిన ప్రేమేందర్ రెడ్డికే టికెట్ ఇచ్చి పోటీలో నిలిపారు. అయితే ఒక్క వరంగల్ నగరం, ఖమ్మం నగరంలో తప్పా…మిగతా ప్రాంతాల్లో బీజేపీ బలంగా లేదు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలదే హవా… దీంతో బండి, ఉత్తమ్‌లు అధికార పార్టీ వ్యతిరేక ఓటుపై నమ్మకం పెట్టుకున్నారు. ఇక వామపక్షాల అభ్యర్థిగా విజయసారథిరెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలో కమ్యూనిస్టులకు చెప్పుకోదగ్గ ఓటుబ్యాంకు ఉండడంతో ఆయన ప్రభుత్వ వ్యతిరేక ఓటును భారీగా చీల్చే అవకాశం ఉంది. మరోవైపు ఇండిపెండెంట్ అభ్యర్థులు చాలా మంది బరిలో ఉండడం బండి సంజయ్, ఉత్తమ్ కుమార్‌లను భయపెడుతోంది.

ఇక తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌ కూడా ఈ ఎమ్మెల్సీ స్థానంలో గెలిచి శాసనమండలికి వెళ్లాలని పట్టుదలగా ఉన్నారు. నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ ఇచ్చి తమ అభ్యర్థిని రంగంలో దింపడంతో ఖంగుతిన్న కోదండరామ్ ఒంటరిగానే బరిలోకి దిగి ప్రచారం చేసుకుంటున్నారు. ఆయనకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ప్రచారం చేస్తున్నారు. .అయితే అభ్యర్థులు చాలా మంది బరిలో ఉండడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి విజయావకాశాలకు గండిపడుతుందోనని కోదండరామ్ టెన్షన్ పడుతున్నారు. ఇక తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ కూడా మూడు జిల్లాలు చుట్టేస్తూ ప్రచారం చేస్తున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలోని రెబల్ వర్గం తనకు మద్దతు ఇస్తుందని ఆశపడుతున్నారు. ఇదే పట్టభద్రుల స్థానం నుంచి భువనగిరికి చెందిన సూదగాని శంకర్ గౌడ్ ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు. ఒకప్పుడు మాజీ మంత్రి దేవేందర్ గౌడ్‌కు పీఏ అయిన శంకర్ గౌడ్ బీసీ సామాజికవర్గంలో మంచి పట్టు ఉంది.

ఆయన కూడా విస్తృతంగా ప్రచారం చేసుకుంటూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకును చీల్చి తన సామాజికవర్గం ఓట్లను కొల్లగొట్టే పనిలో ఉన్నారు. ఇక తీన్మార్ మల్లన్నగా పేరుగాంచిన నవీన్ స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మూడు జిల్లాలలో దాదాపు 1600 కి.మీ. పాదయాత్ర చేసి తనను గెలిపించాలని ఓటర్లను వేడుకుంటున్నారు. తీన్మార్ మల్లన్న కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటును భారీగా చీలుస్తాడని ఉత్తమ్, బండి సంజయ్‌లు టెన్షన్ పడుతున్నారు. యువతెలంగాణ పార్టీ తరపున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణిరుద్రమ కూడా పోటీ చేస్తున్నారు. ఆమె కూడా ఊరూరా తిరుగుతూ తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు భారీ సంఖ్యలో ఉండడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటును దాదాపు 10 మంది అభ్యర్థులు పంచుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక టీఆర్ఎస్‌కు ఉండే ఓటు బ్యాంకు అలాగే ఉంటుందని, ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఇండిపెండెంట్లు పంచుకునే అవకాశం ఉండడంతో పార్టీల వాదనలు, మీడియా విశ్లేషణలు ఎలా ఉన్నా…పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది. మొత్తంగా వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో భారీ సంఖ్యలో ఇండిపెండెంట్ అభ్యర్థులు సవాల్ విసురుతుండడంతో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.