ఐపీఎల్‌ 10:హైదరాబాద్‌కు మూడో విజయం

196
Bhuvneshwar Kumar's 5-for inspires Sunrisers Hyderabad to thrilling win
Bhuvneshwar Kumar's 5-for inspires Sunrisers Hyderabad to thrilling win

వరుసగా రెండు ఓటములతో ఢీలాపడ్డ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పుంజుకుంది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ భువనేశ్వర్‌కుమార్‌ (5/19) అద్వితీయమైన బౌలింగ్‌తో సొంతగడ్డపై మూడో విజయంతో మురిసింది. సోమవారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 5 పరుగుల ఆధిక్యంతో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ గెలుపొందింది.

160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు తొలి ఓవర్లోనే దెబ్బ తగిలింది. ఒపెనర్ హషీం ఆమ్లా (0).. భువనేశ్వర్‌ బౌలింగ్‌లో మొదటి బంతికే వికెట్ల ముందు దొరికిపోయాడు. ఒక ఎండ్‌లో వోహ్రా నిలకడగా ఆడుతున్నా.. మరో ఎండ్‌లో క్రమం తప్పకుండా వికెట్లు పడ్డాయి. కెప్టెన్‌ మాక్స్‌వెల్‌ (10), మోర్గాన్‌ (13) లు తక్కువ స్కోరుకే ఔటయ్యారు. భువి బౌలింగ్‌లో భారీషాట్‌కు ప్రయత్నించిన మాక్స్‌వెల్‌ లాంగాఫ్‌లో వార్నర్‌ చేతికి చిక్కాడు. ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న మహ్మద్‌ నబి (అఫ్గానిస్తాన్‌).. మోర్గాన్‌ ఆట కట్టించాడు. ఆ తర్వాతి ఓవర్లోనే రషీద్‌ విజృంభించాడు. రెండు అద్భుతమైన బంతులతో మిల్లర్‌ (1), సాహా (0)లను క్లీన్‌బౌల్డ్‌ చేసి మ్యాచ్‌ను సన్‌రైజర్స్‌ వైపు మొగ్గేలా చేశాడు.

14 ఓవర్లలో 84/6తో పీకల్లోతు కష్టాల్లో ఉన్న పంజాబ్‌కు 36 బంతుల్లో 76 పరుగులు అవసరం. ఒకవైపు వికెట్లు పడుతుంటే వోహ్రా ఒంటరి పోరాటం చేశాడు. 15వ ఓవర్లో 20, 16వ ఓవర్లో 21 పరుగులు రాబట్టడంతో 24 బంతుల్లో 35 పరుగులు అవసరమయ్యాయి. ఆ తరువాత 12 బంతుల్లో 16 పరుగులకు వచ్చింది. పంజాబ్ విజయం ఖాయం అనుకున్న దశలో 19వ ఓవర్లో బంతి అందుకున్న భువి అద్భుతమే చేశాడు. తొలి బంతికే కరియప్ప (1) క్లీన్‌బౌల్డ్‌ అవగా.. మూడో బంతికి వోహ్రా వికెట్ల ముందు దొరికిపోయాడు. సన్‌రైజర్స్‌ ఒక్కసారిగా వూపిరి పీల్చుకుంది. ఆఖరి ఓవర్లో 11 పరుగులు చేయాల్సి ఉండగా.. సిద్ధార్థ్‌ కౌల్‌ వైడ్ల పుణ్యమా అని మరొకసారి ఉత్కంఠ చోటు చేసుకుంది. నాలుగో బంతికి ఇషాంత్‌ ఆఫ్‌స్టంప్‌ ఎగరడంతో సన్‌రైజర్స్‌ సంబరాల్లో మునిగిపోయింది.

అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులు సాధించింది. డేవిడ్‌ వార్నర్‌ (70 నాటౌట్‌; 54 బంతుల్లో 7×4, 2×6) నమన్‌ ఓజా (34; 20 బంతుల్లో 2×4, 1×6) లు బ్యాటుకు పని చెప్పడంతో 159 పరుగుల చేయగలిగింది.