భర్త కేసుపై తొలిసారి స్పందించిన శిల్పా శెట్టి..

87

గత కొన్ని రోజులుగా బాలీవుడ్‌లో పోర్న్‌ రాకేట్‌ సంచలనంగా మారింది.ఈ కేసులో ఇప్పటికే బాలీవుడ్ నటి శిల్ప శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్టు అయిన సంగతి తెలిసిందే. జులై 19న కుంద్రాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. మరోవైపు తన భర్త అరెస్టు అయిన తర్వాత శిల్పా శెట్టి అధికారికంగా తొలిసారి స్పందించారు. సోషల్ మీడియా ద్వారా ఒక ప్రకటనను విడుదల చేశారు.

గడిచిన కొద్ది రోజులు తనకు చాలా కష్ట కాలమని… తనపై ఎన్నో రూమర్లు, ఆరోపణలు వచ్చాయని ఆమె అన్నారు. తనని ట్రోల్ చేస్తూ… తనపై ప్రశ్నలు సందిస్తూ తన ఫ్యామిలీపై వచ్చిన ఆరోపణలన్నీ మీడియా ప్రతినిధులు, తన మేలుకోరని వారందరూ కురిపించారు అని చెప్పింది. అయితే ఇప్పటివరకు తన భర్తపై వచ్చిన ఆరోపణలపై తానేమీ స్పందించలేదని.. ఇకపై కొద్దిరోజులు ఈ విషయంపై తన దగ్గర నుండి ఎలాంటి స్పందన కూడా ఉండదని ఖచ్చితత్వం వ్యక్తం చేశారు.

ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉన్న తను “ఎప్పుడూ ఫిర్యాదు చేయను… ఎవరికీ వివరించను” అనే సూత్రాన్ని పాటిస్తానని తెలిపారు శిల్పా. ఇప్పటివరకు అయితే తాను ఈ కేసు విషయమై ఎలాంటి ఆరోపణలు కానీ స్టేట్మెంట్లు కానీ ఇవ్వలేదని.. కాబట్టి తన పేరు మీద వచ్చిన స్టేట్మెంట్లు అన్ని తప్పు అని వివరించారు. “ఇది జరుగుతున్న విచారణ… నాకు ముంబై పోలీసు వారిపై, భారత న్యాయ సంస్థలపై పూర్తి విశ్వాసం ఉంది. ఇక చట్టబద్ధంగా తాము సహకరించవలసిన ప్రతి విధానానికి మేము సంసిద్ధంగా ఉంటాము,” అని తెలిపారు.

ఇక ఒక తల్లి స్థానంలో శిల్పా శెట్టి అందరికీ చేస్తున్న విన్నపం లో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ గోప్యతను గౌరవించాల్సిందిగా… తన బిడ్డల భవిష్యత్తు కోసం ఎటువంటి అనఫిషీయల్ వార్తలను ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా చట్టాన్ని గౌరవించే భారత పౌరురాలిగా కష్టపడి పనిచేసే ప్రొఫెషనల్ గా తాను ఈ దేశం గురించి ఎంతో గర్వపడుతున్నానని… అలాగే ప్రజలు కూడా తనను ఎంతో నమ్మారని ఇప్పటివరకు తనను నమ్మిన వారిని ఎవరిని తాను మోసం చేయలేదు. అలాగే తక్కువ చేయలేదని చెప్పారు. ఈ కష్టకాలంలో తన కుటుంబ గౌరవాన్ని, గోప్యతను ప్రతి ఒక్కరూ గౌరవించాలని చెప్పిన ఆమె ఈ కేసు విషయంలో మాత్రం చట్టం తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది కాబట్టి అందరూ ప్రశాంతంగా ఉండాలని శిల్పాశెట్టి తెలియజేశారు.