కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా..?

262
rahul gandhi

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘెర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. మోడీ సునామీ ముందు కాంగ్రెస్ మహమహులు మట్టికరిచారు. సీనియర్ లీడర్లే కాదు కాంగ్రెస్ కంచుకోట అమేథిలో రాహుల్ గాంధీ సైతం ఓటమిపాలయ్యారు. అయితే కేరళలోని వయనాడ్‌ నుండి దాదాపుగా 8 లక్షల మెజార్టీతో గెలిచి సరికొత్త రికార్డు సృష్టించారు.

ఇక లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఇప్పటికే పలు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీనే తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై పార్టీ వర్గాలు స్పష్టత ఇవ్వనప్పటికీ ఇవాళ జరిగే సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్ రాజీనామా చేస్తారన్న వార్త ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇవాళ జరిగే సమావేశంలో కాంగ్రెస్‌ ఓటమికి గల కారణాలపై చర్చించడంతో పాటు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత ఎన్నికపై చర్చించనున్నారు. పార్టీ ఓటమిపై కారణాలు అన్వేషించడానికి ఓ కమిటీ ఏర్పాటుచేసే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా రాహుల్ రాజీనామా చేస్తారన్న వార్తలతో కాంగ్రెస్‌ శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి.