నటుడు ప్రకాష్ రాజ్ తెలంగాణ అసెంబ్లీలో ప్రత్యక్షమయ్యారు. సీఎం కేసీఆర్‌తో కలిసి వచ్చిన ఆయన… ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కాసేపు ముచ్చటించారు. తర్వాత అసెంబ్లీని పరిశీలించారు. ప్రకాష్ రాజ్ ముఖ్యమంత్రి కేసీఆర్ కలయిక ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఈ భేటీ వెనుక రాజకీయ కోణం ఉందని భావిస్తున్నారు. కేసీఆర్ తెరపైకి తెచ్చిన ఫెడరల్ ఫ్రంట్ పై ప్రకాష్ రాజ్ చర్చించనున్నట్టు సమాచారం. ఫెడరల్ ఫ్రంట్‌లో ప్రకాష్ రాజ్‌ను కూడా భాగస్వామిని చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఉన్నారని తెలుస్తోంది.
బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ ఏకం చేయాలని చూస్తున్నారు సీఎం కేసీఆర్. అందులో భాగంగానే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని ఇటీవలే కేసీఆర్ కలిశారు. ఇక గౌరీలంకేశ్ హత్య జరిగినప్పటి నుంచి ప్రధాని మోదీపై, బీజేపీ నేతలపై ప్రకాశ్ రాజ్ విమర్శలు సంధిస్తున్నారు.
అయితే ప్రకాశ్ రాజ్‌ను కూడా ఫెడరల్ ఫ్రంట్‌లో భాగస్వామిని చేసుకోవాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఆయనను భేటీకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం సీఎం కేసీఆర్, ప్రకాశ్ రాజ్ మీడియాతో మాట్లాడే అవకాశముంది.