పవన్ కల్యాణ్‌పై పోసాని ఫైర్‌..

89
- Advertisement -

జనసేన అధినేత,పవర్‌స్టార్‌ పవన్ కల్యాణ్ నటుడు,వైసీపీ నేత పోసాని కృష్ణమురళి ఫైర్‌ అయ్యారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై విమర్శలు చేయడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని, తనని తిడుతూ గత 24 గంటల్లో కొన్ని వేల ఫోన్‌ కాల్స్‌, మెస్సేజ్‌లు వచ్చాయని పోసాని అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతుండగానే ఓ కాల్ వచ్చిన విషయాన్ని కూడా అందరికీ చూపించారు. పవన్ వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేస్తున్నందునే తాను స్పందించాల్సి వచ్చిందని స్పష్టత ఇచ్చారు.

కనీసం ఐదారు కిలోమీటర్లు కూడా నడవలేని పవన్ కల్యాణ్, పాదయాత్రలో వేల కిలోమీటర్లు నడిచిన జగన్ తో పోల్చుకోవడం తనకు నచ్చలేదని పోసాని అన్నారు. తాను జగన్ అభిమానినని, ఆయనను ఎవరేమన్నా భరించలేనని పోసాని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గతంలో పవన్ కల్యాణ్ కు, తనకు మధ్య జరిగిన ఓ గొడవను పోసాని మీడియాకు వివరించారు. తాను సాధారణంగా సాయంత్రం 6 గంటలకే షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్లిపోతానని, కానీ ఓసారి సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా సమయంలో రాత్రి షెడ్యూల్ పెట్టారని వెల్లడించారు. రాత్రి 9 గంటలు అవుతున్నా గానీ పవన్ రాలేదని, దాంతో తాను ఇంటికి వెళ్లిపోయానని తెలిపారు.

రాత్రి 10.30 గంటల సమయంలో భోజనం చేస్తుండగా పవన్ ఫోన్ చేసి తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. “ఇది సినిమా అనుకున్నారా, ఇంకేమైనా అనుకున్నారా? ఎవరికి చెప్పి ఇంటికి వెళ్లారు? మేమందరం పిచ్చోళ్లమా? అంటూ పవన్ కేకలు వేశారు. దాంతో నాక్కూడా కోపం వచ్చింది. నేను కూడా ఆర్టిస్ట్ నే… మీకోసం 9 గంటల వరకు చూశాను… రాలేదు. మీరు 10 గంటలకి వస్తే అప్పటిదాకా మేం ఎదురుచూస్తుండాలా? అంటూ నేను కూడా అదే స్థాయిలో బదులిచ్చా. ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా నుంచి నన్ను తీసేశారు” అంటూ వివరించారు.

‘‘చిరంజీవిగారు పార్టీ పెట్టిన కొత్తలో అవినీతి గురించి మాట్లాడుతున్నారు. ఆయనను అప్రతిష్టపాలు చేద్దామని కొందరు తెదేపా నాయకులు అనుకున్నారు. చిరంజీవి కుమార్తె గురించి, ఇంట్లో మహిళల గురించి లైవ్‌లో ఘోరంగా మాట్లాడారు. ఈ విమర్శలు చిరుకు తెలిసి అన్నం తినకుండా వ్యాన్‌లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. మంత్రి కన్నబాబు అప్పుడు ప్రజారాజ్యంలో ఉన్నారు. ఆయన నాకు సన్నిహితుడు. కన్నబాబుగారు నాకు ఫోన్‌ చేశారు. జరిగింది చెప్పారు. నేను ‘అన్నయ్యకు ఫోన్‌ ఇవ్వండి’ అంటే ఆయనకు ఇచ్చారు. ఆయన గద్గద స్వరంతో ‘పోసాని.. రాజకీయాలకు, నా భార్యాబిడ్డలకు ఏం సంబంధం’ అని వాపోయారు. వెంటనే ప్రజారాజ్యం పార్టీ ఆఫీస్‌కు వెళ్లి, ప్రెస్‌మీట్‌పెట్టి కేశినేని నానిపై ప్రశ్నల వర్షం కురిపించా. అంతే అటు వైపు నుంచి సమాధానం రాలేదు. అప్పుడు చిరంజీవి సన్నిహితులతో ‘పోసాని నా గుండెల్లో ఉన్నారు’ అని అన్నారట. ఆరోజు మీ అన్నయ్య కుటుంబాన్ని వాళ్లు అన్నేసి మాటలు అంటే పవన్‌కల్యాణ్‌, ఆయన అభిమానులు ఎక్కడ ఉన్నారు? బయటకు వచ్చి ప్రశ్నించలేదే? అన్నారు.

బెల్లంకొండ సురేశ్‌గారు చిరంజీవిని ఏదో అన్నారని, అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. ‘ఇది సినిమా ఇండస్ట్రీ విషయం మీకు సంబంధం లేదు’ అని చిరంజీవి వారిపై కేకలేసి పంపించివేశారు. మీరు, మీ ఫ్యాన్స్‌ సైకోలు. ఇతర హీరోల ఫంక్షన్‌లకు వెళ్లి ‘పవన్‌.. పవర్‌స్టార్‌’ అని అరుస్తుంటారు. నాకు ఇప్పటివరకూ ఆరేడు వేల మెస్సేజ్‌లు వచ్చాయి. మంచు విష్ణు నామినేషన్‌ వేయడానికి వెళ్తే, అక్కడకు కూడా 10మంది పవన్‌ ఫ్యాన్స్‌ వచ్చారట. పవన్‌కల్యాణ్‌.. నీ సైకో ఫ్యాన్స్‌కు ఏం చెప్పుకుంటావో చెప్పుకో. ఇక నుంచి రాజకీయాల్లో నా గురించి మాట్లాడు. నన్ను టార్గెట్‌ చెయ్‌. నాది తప్పు అయితే, నీకు దండం పెడతా. అంతేకానీ, నా కుటుంబ సభ్యులను ఈ వివాదంలో లాగొద్దు. చిరంజీవిగారు మీ తమ్ముడిని అదుపులో పెట్టుకోండి.’’ అని పోసాని కృష్ణమురళి అన్నారు.

- Advertisement -