నటుడు పోసానిపై పవన్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం..

49

హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంగళవారం ప్రెస్ క్లబ్‌లో నటుడు పోసాని కృష్ణమురళి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో ఆయన మరోసారి పవన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ప్రెస్ క్లబ్ వద్దకు ఒక్కసారిగా దూసుకొచ్చారు. ఖబడ్దార్ అంటూ పోసానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారి నినాదాల్లో సీఎం జగన్ పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. అప్రమత్తమైన పోలీసులు ప్రెస్ క్లబ్ వద్ద భారీగా మోహరించారు. పలువురు పవన్ అభిమానులను అదుపులోకి తీసుకున్నారు.

తెలంగాణ స్టేట్ జనసేన యూత్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. దీంతో ఆయనతో పాటు పలువురిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పవన్ కల్యాణ్‌పై పోసాని కృష్ణ మురళి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చూస్తూ ఊరికునేది లేదని హెచ్చరించారు. పవన్ కల్యాణ్ సైకో కాదని, పోసానినే సైకో అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో కాకుండా వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్నారని, పోసానిని వదిలేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పవన్‌ను లక్ష్యంగా చేసుకుంటారా? అని మండిపడ్డారు. తాము ధర్మపోరాటం చేస్తున్నామని వారు స్పష్టం చేశారు.