కేంద్ర ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలి- నిరంజన్ రెడ్డి

102
Niranjan Reddy

వరి ధాన్యం సేకరణలో కేంద్రం ఎఫ్‌సీఐ ద్వారా రాష్ట్రాలకు ఇచ్చిన ఉత్తర్వులలో మద్దతు ధరకు మించి ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా రైతులకు బోనస్, అదనపు ధర ఇవ్వకుండా అడ్డుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలి. రైతుల పంటలు కొనడంలో రాద్దాంతం ఎందుకు ? అని ప్రశ్నించారు. కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్రాలు రైతులకు మద్దతు ధరకు మించి ఇస్తే అభినందించాల్సింది పోయి అడ్డుపుల్లలు ఎందుకు వేస్తున్నారని మంత్రి అడిగారు.

పత్తి సేకరణ విషయంలో కేంద్రం సీసీఐ ద్వారా ఒక రైతుకు కేవలం 40 క్వింటాళ్ల వరకే కొనుగోలుకు అనుమతిస్తుంది. దానికి మించి తీసుకొస్తే రీ వెరిఫికేషన్ చేయాలని రైతులను ఇబ్బంది పెట్టడం ఎందుకు.. రైతులు స్వయంగా పట్టాదారు పాస్ బుక్ తో రావాలని.. లేదంటే వారి రక్త సంబంధికుల రేషన్, ఆధార్ కార్డులతో మాత్రమే రావాలని మరో షరతు ఎందుకు పెట్టింది అని మంత్రి అన్నారు.

రైతుబంధు డాటా ఆధారంగా రాష్ట్రం వద్ద ప్రతి ఎకరా, ప్రతి గుంట వారీగా రైతుల, పంటల వారీగా ప్రభుత్వం వద్ద వివరాలు ఉన్నాయి. కాబట్టి ఈ నిబంధన ఎత్తేయాలి.రైతు ఖాతాలోనే డబ్బులు జమ అవుతున్న నేపథ్యంలోనూ ఈ నిబంధనలు అర్దరహితం. షరతులు తొలగించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం తరపున కేంద్రానికి లేఖ రాశామని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.