అన్నదాతకు రైతుబంధుతో ‘ఆసరా’: నిరంజన్ రెడ్డి

178
niranjan

అన్నదాతలకు రైతు బంధుతో ఆసరా నింపామని తెలిపారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రైతుబంధు కింద 2018 వానాకాలం నుండి ఇప్పటివరకు ఆరు విడతలలో 35,660.65 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. మొదటి విడతలో చెక్కుల ద్వారా, ఆ తరువాత నేరుగా రైతు బ్యాంకుల ఖాతాలలోకి డబ్బులు జమ చేశామని వెల్లడించారు.

మొదటి రెండు విడతలలో ఎకరానికి రూ.4 వేల చొప్పున, మిగతా నాలుగు విడతలలో ఎకరానికి రూ.5 వేల చొప్పున రైతులకు పంపిణీ చేశామన్నారు. గత మూడేళ్ల కాలంలో ఒక్కో ఎకరానికి రూ.28 వేల నగదు బదిలీ చేశామని వెల్లడించిన నిరంజన్ రెడ్డి…ఈ యాసంగిలో 59.16 లక్షల మంది రైతులకు రూ.7351.74 కోట్లు ఖాతాలలో జమ చేశామని తెలిపారు.

ఈ ఏడాది వానాకాలం, యాసంగి కలిపి రైతుబంధు కింద రూ.14,640.44 కోట్లు పంపిణీ చేశామని తెలిపిన నిరంజన్ రెడ్డి… 2018 – 19 లో 50.25 లక్షల మంది రైతులకు రూ.10,488.19 కోట్లు , 2019 – 20 లో 51.61 లక్షల మంది రైతులకు రూ.10,532.02 కోట్లు, 2020 వానాకాలంలో 58.02 లక్షల మంది రైతులకు రూ.7288.70 కోట్లు రైతుబంధు కింద పంపిణీ చేశామన్నారు.

దళారీ బెడద లేదు, పార్టీల ఊసులేదు, పైరవీలకు ఆస్కారం లేదు, అవినీతికి తావులేదన్నారు. పట్టాదారు పాసుపుస్తకం కలిగి, బ్యాంకు ఖాతాలతో సరయిన వివరాలు నమోదు చేయించుకున్న ప్రతి రైతు ఖాతాలో రైతుబంధు సాయం జమ చేశామన్నారు. వ్యవసాయానికి వెన్నెముకగా నిలవాలని, అన్నం పెట్టే రైతు అగ్రస్థానంలో ఉండాలని ప్రపంంచలోనే ఏ దేశంలో లేనివిధంగా కేసీఅర్ రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు.

కరోనా విపత్కర పరిస్థితులలోనూ అన్నదాతలకు రైతుబంధు సాయం అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది… తెలంగాణ రైతాంగం తరపున కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. వ్యవసాయం లాభసాటి చేసేందుకు రైతుబంధు, ఉచిత కరంటు, వ్యవసాయ కుటుంబాలకు అండగా నిలిచేందుకు రైతుభీమా పథకాలతో కేసీఆర్ రైతుల పక్షపాతిగా నిలిచారన్నారు. కేసీఆర్ వ్యవసాయ విధానాలు దేశానికే ఆదర్శం అన్న నిరంజన్ రెడ్డి… తెలంగాణ వ్యవసాయ విధానాలను దేశవ్యాప్తంగా అమలుచేయాలన్నారు.

కేంద్రం రైతులకు భరోసా కల్పించే చర్యలను వదిలేసి వ్యవసాయం కార్పోరేట్ల పరం చేసే చర్యలు సరికాదన్నారు. రైతుబంధు నిధులు పకడ్భందీగా రైతుల ఖాతాలకు చేరేందుకు నిరంతరం కృషిచేసిన వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది, ఎన్ఐసీ, ఆర్థిక, రెవిన్యూ ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు నిరంజన్ రెడ్డి.