సిరిసల్ల వర్షాలపై అధికారులతో మంత్రి కేటీఆర్ రివ్యూ..

94
ktr

రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాల వల్ల కలిగిన నష్టం పై జిల్లా అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. వరదల వల్ల ముంపుకు గురైన ప్రాంతాల పరిస్థితిని, పునరావాస ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో వరదలు వచ్చిన ఎలాంటి నష్టం కలగకుండా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు

సిరిసిల్ల‌, వేముల‌వాడ ప‌ట్ట‌ణాల్లో వ‌ర్షం నీరు ఎక్క‌డా నిల‌వ‌కుండా ఉండేలా నిర్దిష్ట‌మైన ప్ర‌ణాళిక రూపొందించాల‌ని కేటీఆర్ అధికారుల‌ను ఆదేశించారు. రాబోయే వారం రోజుల్లోగా జిల్లాలో పంట న‌ష్టానికి సంబంధించిన నివేదిక స‌మ‌ర్పించాల‌న్నారు. పట్టణంలో వరదల సమస్య మరోసారి పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు.

గతంలో ఎన్నడూలేని విధంగా మంగళవారం రికార్డు స్థాయిలో కురిసిన వర్షానికి రాజ‌న్న సిరిసిల్ల జిల్లా తడిసి ముద్దయిన విష‌యం విదిత‌మే. జిల్లావ్యాప్తంగా 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 30 ఏండ్ల తర్వాత అంతటి భారీ వాన కురిసినట్టు అధికారులు తెలిపారు. నడుము లోతు నీరు రావడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. దుకాణాలు, షాపింగ్‌మాల్స్‌, మెడికల్‌ హాళ్లలోకి నీరు చేరి బట్టలు, నిత్యావసరాలు తడిసి తీరని నష్టం వాటిల్లింది. సిరిసిల్లలోని బస్టాండ్‌, కలెక్టరేట్‌ వరద నీటితో చెరువులుగా మారాయి. కలెక్టరేట్‌ గేట్లు కూడా తెరవని పరిస్థితి నెలకొనడంతో అధికారులంతా బయటే ఉండి, సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారని అధికారులు వెల్లడించారు. ఈ స‌మీక్ష స‌మావేశంలో క‌లెక్ట‌ర్ అనురాగ్ జ‌యంతి, ఎస్పీ రాహుల్ హెగ్డే, నీటిపారుద‌ల‌, మున్సిప‌ల్, పంచాయ‌తీ, వ్య‌వ‌సాయ‌, ఇత‌ర సంబంధిత ప్ర‌భుత్వ శాఖ‌ల అధికారులు హాజ‌ర‌య్యారు.