వరుసగా జిహెచ్ఎంసి అభివృద్ధి పనుల పైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్లమెంట్ స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్న పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు ఈరోజు సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెల్ల నియోజకవర్గాలకు సంబంధించిన వారితో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో జిహెచ్ఎంసి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల పైన, మౌలిక వసతుల కల్పన పైన ప్రజల స్పందనను, మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేల నుంచి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.
దీంతోపాటు త్వరలో చేపట్టనున్న వివిధ కార్యక్రమాలను సైతం వారికి వివరించారు. ప్రస్తుతం నడుస్తున్న కార్యక్రమాలను మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్తామని, ఇందుకు సంబంధించి అధికారులతో కూడా మరోసారి సమావేశం నిర్వహిస్తామని మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు. జిహెచ్ఎంసి గత ఐదు సంవత్సరాలుగా చేపడుతూ వస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం, రోడ్ల నిర్మాణము, డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం మరియు ఇతర మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన కార్యక్రమాలు పైన ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని ఈ సందర్భంగా మంత్రికి ఎమ్మెల్యేలు తెలియజేశారు.
ముఖ్యంగా లాక్ డౌన్ సమయం లో పెద్ద ఎత్తున రోడ్లను విస్తరించడం లేదా నిర్మాణం చేయడం ద్వారా ప్రజల్లో ఒక మంచి గుడ్ విల్ వచ్చిందని వారు తెలిపారు.త్వరలోనే జిహెచ్ఎంసి పరిధిలో సుమారు 85 వేల ఇళ్లు, పేద ప్రజలకు అందించేలా ముందుకుపోతున్నామని ఇందుకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా వేగవంతం చేయాలని జిహెచ్ఎంసి మరియు జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు. దీంతోపాటు పార్కుల అభివృద్ధి పైన ప్రత్యేకమైన డ్రైవ్ చేపట్టి ముందుకు పోతున్నామని తెలియజేశారు.
చెరువుల అభివృద్ధి సుందరీకరణ విషయంలోనూ సాగునీటి శాఖ తో కలిసి సమన్వయంతో ముందుకు పోవాలని అధికారులను ఆదేశించినట్లు కూడా మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేలకు తెలియజేశారు. ఎమ్మెల్యేలు తమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న లేదా ప్రజలు కోరుకుంటున్న మౌలిక వసతుల కార్యక్రమాలను తన దృష్టికి తీసుకు వస్తే వాటిని పరిష్కరించేందుకు సహకరిస్తామని కూడా ఎమ్మెల్యేలకు మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ,సబితా ఇంద్రారెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.