సీఎం కేసీఆర్‌ కలను సాకారం చేయడం ఆనందంగా ఉంది-మంత్రి హరీష్

49

పేదలు ఆత్మ గౌరవంతో జీవించాలన్నది కేసీఆర్ కల. ఆ ఉద్దేశ్యంతోనే కేసిఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్ల కార్యక్రమం చేపట్టారు అన్నారు మంత్రి హరీష్‌ రావు. శనివారం ఆయన సిద్ధిపేట జిల్లా, కేసీఆర్ నగర్‌లో 360 డబుల్ బెడ్ రూం గృహ ప్రవేశాలు, పైపుడ్ వంట గ్యాస్ సరఫరా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సిద్దిపేట నియోజకవర్గంలో 3 వేల డబుల్ బెడ్ రూం ఇండ్లను పేదలకు కేటాయించి గృహ ప్రవేశాలు జరిపించాము.. మరో 500 డబుల్ బెడ్ రూం ఇండ్లు గృహ ప్రవేశాలకు సిద్ధం చేశామని తెలిపారు.

ఒక్క సిద్దిపేట పట్టణంలోనే సకల సౌకర్యాలతో కేసిఆర్ నగర్‌లో గేటెడ్ కమ్యూనీటి తరహాలో 163 కోట్ల రూపాయలతో 2460 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేపట్టాం. వాటిలో ఇప్పటికే 1976 డబుల్ బెడ్ రూం ఇండ్లను పేదలకు కేటాయించి పండుగ వాతావరణంలో నూతన వస్త్రాలు బహూకరించి, గృహ ప్రవేశాలు చేపించామన్నారు. కేసిఆర్ నగర్ కాలనీలో పేదల కోసం అదనంగా మరో 1000 ఇండ్లను నిర్మిస్తున్నాం. దీని కోసం స్థల ఎంపిక, టెండర్ ప్రక్రియ పూర్తయింది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కలను సాకారం చేయడం ఆనందంగా ఉంది అన్నారు.

కేసిఆర్ నగర్ కాలనీ ప్రజలు పరిశుభ్రత, పచ్చదనంకు ప్రాధాన్యం ఇచ్చి మోడల్ కాలనీగా అవతరించాలి. జిల్లాలో మొట్ట మొదటి సారిగా కేసిఆర్ నగర్ కాలనీలో పైపుడ్ గ్యాస్ సరఫరాను ప్రారంభించుకున్నాం.. పైపుడ్ గ్యాస్ సరఫరా కనెక్షన్ ఛార్జీలు 7000 కాగా అతి తక్కువ ఖర్చు రూ. 1090/- తోనే కేసిఆర్ నగర్ లోని పేదలకు ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నామని మంత్రి తెలిపారు. పైపుడ్ గ్యాస్ సరఫరాతో రక్షణతో పాటు డబ్బు ఆదా అవుతుంది. సిలిండర్ కోసం ఎదురు చూసే బాధలుండవు అన్నారు. పైపుడ్ గ్యాస్ సరఫరా ద్వారా 35 శాతం నుంచి 40 శాతం డబ్బులు ఆదా అవుతాయి. త్వరలో టొరెంటో కంపెనీ ప్రతినిధులు సిద్దిపేట పట్టణంలోని అవసరమైన వారికి పైపుడ్ గ్యాస్ కనెక్షన్ ఇవ్వనున్నారు అని మంత్రి హరీష్‌ తెలిపారు.