లాక్ డౌన్ నుండి ధాన్యం సేకరణకు సడలింపు- మంత్రి గంగుల

100
minister gangula

ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకున్నట్టు, లాక్ డౌన్‌లో సైతం గత సంవత్సరం మాదిరిగా కొనుగోళ్లు జరుగుతాయని, ధాన్యం సేకరణకు కోవిడ్ నిబందనలతో మినహాయింపులు ఉన్నాయన్నారు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పౌరసరఫరాల శాఖ తీసుకుంటున్న చర్యల్ని వివరించారు మంత్రి గంగుల.

ఈ యాసంగిలో ఎకరాకు 25 క్వింటాళ్ల దిగుబడి అంచనాతో 52లక్షల 76వేల ఎకరాల వరి సాగుకు గానూ టోకుగా 132 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసామని తెలియజేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం ఎఫ్.సి.ఐ ద్వారా 80లక్షల 88వేల మెట్రిక్ టన్నులు సేకరించాలని ఆదేశాలు జారీ చేసింది. అందుకనుగుణంగా అవసరమైన 15,104 కోట్ల రూపాయల్ని అందుభాటులో ఉంచుకోవడంతో పాటు అన్నిరకాల ఏర్పాట్లతో పటిష్ట చర్యల్ని పౌరసరఫరాల శాఖ తీసుకుందన్నారు మంత్రి. రాష్ట్రంలో ధాన్యం సేకరణ కోసం 7183 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదించగా మే పదో తేదీ నాటికి 6504 కేంద్రాల్ని ఏర్పాటు చేశామని ఇందులో 28 కేంద్రాల్లో కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు మంత్రి.

వీటిద్వారా 2,31,261 రైతుల నుండి 29 లక్షల 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి మిల్లర్లకు పంపామని వీటి విలువ 5508 కోట్ల రూపాయలని చెప్పారు. సాదారణ రకానికి 1868, గ్రేడ్ ఏ రకానికి 1888 రూపాయలు కేంద్రం నిర్ణియించిన ధర ప్రకారమే సేకరణ జరుగుతుందన్నారు. ధాన్యం సేకరణ పూర్తైన 3 నుండి 4 రోజుల్లోపే రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తున్నామని నిన్నటివరకూ 2389 కోట్ల రూపాయల్ని రైతులకు బదిలీ చేశామన్నారు. ఎప్పుకప్పుడు కొనుగోలు కేంద్రాలను మిల్లులతో అనుసంధానం చేసే ప్రక్రియను జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని, ఎక్కడా ఎలాంటి జాప్యం జరగకుండా పౌరసరఫరాల శాఖ అధికారులు సమన్వయం చేసుకుంటున్నారన్నారు.

రాష్ట్రంలో 942 పారభాయిల్డ్ రైస్ మిల్లులు, 1534 రా రైస్ మిల్లులున్నాయన్నారు మంత్రి గంగుల. రాష్ట్రంలో గోనె సంచుల కొరత లేదని అవసరమైన మేర 20 కోట్ల గోనె సంచుల్లో 54శాతం కొత్త గోనె సంచులు, 46 శాతం పాత గోనె సంచులు అందుభాటులో ఉన్నాయన్నారు. అకాల వర్షాల వల్ల రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా టార్పాలిన్లను సైతం అంధుబాటులో ఉంచామన్నారు.

అక్కడక్కడా కొన్ని ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జాప్యం జరగుతుందని తమ ద్రుష్టికి వచ్చిందని, కరోనా సంక్షోభం నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల వద్ద, అన్ లోడింగ్ జరిగే రైస్ మిల్లుల వద్ద హమాలీల కొరత ఉండడంతో ఇలా జరుగుతుందని, హమాలీల కొరతను అధిగమించడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు మంత్రి గంగుల కమలాకర్. భవిష్యత్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నా ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని, గత సంవత్సరం లాక్ డౌన్‌లో సైతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరించిన విషయాన్ని గుర్తుచేశారు.

తెలంగాణలో కాళేశ్వర ఫలాలు దక్కుతున్నాయని, పంట దిగుబడుల్లో గణనీయమైన ప్రగతిని సాదించడంతో గతంలో కన్నా ఎక్కువ పంట వస్తుందని ఈ ధాన్యం సేకరణలో రైతులు అధికారులకు సహకరించాలని విజ్ణప్తి చేశారు. అకాల వర్షాలకు ఎలాంటి అదైర్యానికి లోనవకుండా తమవంతు వచ్చేవరకూ రైతులు సంయమనంతో వ్యవహరించి కొనుగోలు కేంద్రాల వద్ద తమ పంటను అమ్ముకోవాలని సూచించారు. యాసంగిలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా కొనుగోళ్లని నిర్వహిస్తామని మంత్రి గంగుల కమలాకర్ తెలియజేశారు.