రెసిడెన్షియల్ జోన్ లోకి మార్పించాలని మంత్రి వినతి..

36
Minister Errabelli

జీహెచ్‌ఎంసీ 4వ డివిజన్ మీర్ పేట్ హౌసింగ్ బోర్డు కాలనీ న్యూ నరసింహ నగర్ సర్వే నంబర్ 6, 4/1 పరిధిలోని భూములను రైల్వే జోన్ నుండి రెసిడెన్షియల్ జోన్ లోకి మార్పించాలని ఆ డివిజన్ నూతన కార్పొరేటర్ జెర్రి పోతుల ప్రభుదాస్, డివిజన్ టీఆరెఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డిలు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును అభ్యర్థించారు. మంత్రుల సముదాయంలోని మంత్రి నివాసంలో సోమవారం మంత్రి ఎర్రబెల్లిని ఈ మేరకు కలిశారు. అలాగే సర్వే నంబర్ 9లో గల డైమండ్ హిల్స్‌ను సైతం రెసిడెన్షియల్ జోన్‌గా మార్చాలని కోరారు. చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న ఈ విషయంపై గతంలో రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఎన్ ఓ సి ఇచ్చారన్నారు.

అయితే రాష్ట్ర ప్రభుత్వం నుండి తగిన క్లియరెన్స్ లు ఇప్పించాలని వారు మంత్రి ని కోరారు. ఆయా చోట్ల చాలా ఏండ్ల క్రితమే, ప్రజలు ఇండ్లు కట్టుకున్నారు. ఇప్పుడు వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు. ప్రజల ఇబ్బందులు, వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత తొందరలో ఈ సమస్యను పరిష్కరించాలని వారు మంత్రికి విజ్ఞప్తి చేశారు. మంత్రిని కలిసిన వారిలో ఆ కాలనీల సంక్షేమ సంఘాల సలహాదారులు చంద్రకాంత రావు, బోనాల శ్రీనివాస్, అధ్యక్షుడు శివకృష్ణ, రాజేష్, పాషా తదితరులు ఉన్నారు. కాగా, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇందుకు సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.