ఆసక్తిగా మారిన ‘మా’ విందు రాజకీయాలు..

15
MAA election

ఈ ఏడాది ‘మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌’ ఎన్నికలపై రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. అక్టోబర్‌ నెలలో జరగనున్న ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు బలంగా పోటీ పడుతున్నారు. వీళ్లిద్దరిలో ఎవరు గెలుస్తారని అందరూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ ఎన్నికల నేపథ్యంలో విందు, సన్మాన రాజకీయాలు ఊపందుకున్నాయి. ఎన్నికల తేదీ దగ్గర పడడంతో.. అధ్యక్ష పోటీలో ఉన్న అభ్యర్థులు తమదైన శైలీలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ‘మా’ మెంబర్స్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు.

ఇప్పటికే ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ చురుగ్గా ప్రచారం నిర్వహిస్తోంది. మూడు రోజుల క్రితం ప్రకాశ్‌రాజ్‌ గణపతి కాంప్లెక్స్‌ ప్రాంతంలో చిన్న కళాకారులను కలిసి వారి కష్టాలను తెలుసుకున్నారు. శనివారం జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో సినీ నటీనటులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. లంచ్‌ మీట్‌ కూడా ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో తన ప్యానల్‌ గెలిస్తే సభ్యుల సంక్షేమం కోసం రూ.10 కోట్ల కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేస్తానని ప్రకాష్‌ రాజ్‌ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే!

మరోవైపు మరో అభ్యర్థి హీరో మంచు విష్ణు సోమవారం రాత్రి పార్క్‌ హయత్‌ వేదికగా ‘మా’ సభ్యులకు డిన్నర్‌ మీట్‌ ఏర్పాటు చేశారు. ఈ విందు కార్యక్రమంలో ‘మా’ అభివృద్ధిపై విష్ణు తన ఆలోచనలను, భవిష్యత్తు తమ కార్యచరణను సభ్యుల ముందు ఉంచినట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకూ తన ప్యానల్‌ గురించి బయటపెట్టలేదు. ఈ నెల 19న ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చాక తమ ప్యానల్‌తోపాటు మ్యానిఫెస్టోను బయట పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబరు 10న ‘మా’ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లో మా విందు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.