తెలంగాణ రాష్ట్రంలోని హ్యాండ్లూమ్ మరియు టెక్స్టైల్ పరిశ్రమ అభివృద్ధి కోసం నిధులతో పాటు పలు అంశాల్లో కేంద్ర ప్రభుత్వ మద్దతు కోరుతూ పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు, కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి ఒక లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు తోపాటు, సిరిసిల్లలో మెగాపవర్ క్లస్టర్ మంజూరు మరియు చేనేత మరియు జౌళి పరిశ్రమ అభివృద్ధి కోసం పలు అంశాలు తీసుకోవాల్సిన చర్యల పైన మంత్రి కేటీఆర్ ఈ లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలుకి రానున్న బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రిని కోరారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌ను సుమారు 1552 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిందని, ఇందులో సుమారు 1100 కోట్ల రూపాయలు మౌలిక వసతుల కల్పనకు అవసరమవుతాయని, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మెగా టెక్స్టైల్ పార్క్ పథకం ద్వారా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌కు మద్దతు అందించాలని కోరారు. ఈ పథకం ద్వారా సుమారు 500 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందించే అవకాశం ఉందని, ఇందులో కనీసం 300 కోట్ల రూపాయలను వెంటనే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ మౌలికవసతుల సదుపాయాల కల్పన కోసం మంజూరు చేయాలని కోరారు.
పెద్ద ఎత్తున నేతన్నలకు భరోసా కల్పించే ఉద్దేశంతో కాంప్రహెన్సివ్ పవర్లూమ్ క్లస్టర్ డెవలప్మెంట్ స్కీమ్ పథకంలో భాగంగా సిరిసిల్ల పవర్లూమ్ క్లస్టర్ కి పెద్ద ఎత్తున సహాయం అందించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ పథకం కింద 5 వేల మందికి పైగా పవర్లూమ్ మగ్గాలు ఉంటే ఆ ప్రాంతానికి ఈ పథకం వర్తిస్తుందని, ఇందులో భాగంగా టెక్నాలజీ అక్రిడేషన్, నైపుణ్య అభివృద్ధి మరియు మౌలిక వసతుల కింద కేంద్ర సహాయం అందించేందుకు వీలు కలుగుతుందని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పవర్లూమ్ మగ్గాలు జియో ట్యాగింగ్ చేసిందని, రాష్ట్రంలో ఉన్న సుమారు 35,600 పవర్లూమ్స్ మగ్గాల్లో, సిరిసిల్లలోని 25,500 మగ్గాలు ఉన్నాయని, నేపథ్యంలో సిరిసిల్లాను మెగా పవర్ క్లస్టర్ గా గుర్తించాలని కోరారు. పవర్ లుమ్ మరియు మెగా సిల్క్ క్లస్టర్ ప్రాజెక్టు కింద సుమారు 100 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని కేంద్రం అందించే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తన వంతు బాధ్యతగా సిరిసిల్లలో అనేక కార్యక్రమాలు చేపట్టిందని ముఖ్యంగా వర్కర్ టు ఓనర్ స్కీమ్, టెక్స్టైల్ పార్క్ వంటి కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి కేటీఆర్ తన లేఖలో ప్రస్తావించారు. సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమను మరింత ఆధునికరించెందుకు, విస్తరించేందుకు అవసరమైన కార్యక్రమాల కోసం, వాల్యూ చైన్ బలోపేతం, మార్కెట్ అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, కెపాసిటీ బిల్డింగ్, ప్రాజెక్ట్ మానిటరింగ్ వంటి ఖర్చుల నిమిత్తం సుమారు 994 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని, ఇందులో సింహభాగం నిధులను వెంటనే సిరిసిల్లాకి విడుదల చేయాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పవర్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నదని ఈ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలో పరిశ్రమ అభివృద్ధి కోసం సుమారు 756 కోట్ల రూపాయల ఖర్చును భరించేందుకు సిద్ధంగా ఉందన్నారు.
రాష్ట్రంలో పవర్లూమ్ పరిశ్రమ తో పాటు చేనేత పరిశ్రమ కూడా తెలంగాణలో అత్యంత ప్రాధాన్యత ఉందని తెలిపిన మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో సుమారు 40వేల హ్యాండ్లూమ్ కార్మికులు పని చేస్తున్నారన్నారు. ఇందులో యాదగిరి భువనగిరి, గద్వాల్, వరంగల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలో చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు.తెలంగాణ రాష్ట్రానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థను మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. చేనేత కళ పైన డిప్లమా చేసేందుకు ఇక్కడి విద్యార్థులకు అవకాశం లేదని వీరంతా ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలకు వెళ్లి శిక్షణ పొందుతున్న నేపథ్యంలో తెలంగాణకి ఈ విద్యా సంస్థ మంజూరు చేస్తే విద్యార్థులకు అనుకూలంగా ఉండడంతో పాటు ఇక్కడి చేనేత పరిశ్రమ అభివృద్ధికి ఉపయోగపడుతుందని కేటీఆర్ తెలిపారు. ఇందుకు సంబంధించి గుండ్ల పోచంపల్లి మరియు యాదాద్రి భువనగిరి జిల్లాలో అవసరమైన స్థలం అందుబాటులో ఉన్న విషయాన్ని కూడా మంత్రి కేటీఆర్ తెలిపారు. నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ద్వారా బ్లాక్ లెవెల్ హ్యాండ్లూమ్ క్లస్టర్లలను మంజూరు చేయాలని కోరారు.
ఈ పరిశ్రమల పైన కోవిడ్ 19 ద్వారా పడిన ప్రభావాన్ని కూడా మంత్రి కేటీఆర్ తన లేఖలో ప్రస్తావించారు. చేనేత జౌళీ పరిశ్రమలో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయిన నేపథ్యంలో వాటి రికవరీ కొంత మెల్లిగా జరిగే అవకాశం ఉన్నదని, ఇది కూడా ఆయా కంపెనీలకు విదేశాల నుంచి వస్తున్న ఆర్డర్ల మీద ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అనేక కంపెనీలు తమ కార్యకలాపాలను పునరుద్ధరణ చేయడంలో కొంత ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. లక్షలాది మంది ఉపాధి కల్పిస్తున్న ఈ రంగంలో పనిచేస్తున్న వారి సంక్షేమం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కొన్ని అంశాలను రానున్న కేంద్ర బడ్జెట్లో ఊరట కల్పించాలని కోరారు. కోవిడ్ సంక్షోభం దృష్ట్యా ఏర్పడిన అవకాశాలను కూడా అందిపుచ్చుకుని పరిశ్రమ అభివృద్ధికి కేంద్రం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా సూచించారు. కోవి డ్ సంక్షోభం ముగిసే వరకు స్వల్పకాలిక పాలసీ సపోర్ట్ కేంద్రం నుంచి రావాలని సూచించారు. పరిశ్రమలో పని చేస్తున్న కార్మికులకు ఆరు నెలల పాటు జీతాలు చెల్లించేందుకు కేంద్రం నుంచి దీర్ఘకాలిక రుణాలను పరిశ్రమలకు అందించాలని సూచించారు. ఇప్పటికే బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో ఇలాంటి మద్దతు పరిశ్రమకు లభిస్తుందని తెలిపారు. మూడు నెలలపాటు పీఎఫ్, ఈఎస్ఐ వంటి వాటి డిపాజిట్లకు ఎక్స్టెన్షన్ ఇవ్వాలని కోరారు. ఈ పరిశ్రమలో ఉన్నటువంటి కంపెనీలకు పెద్ద ఎత్తున బ్యాంకింగ్ సంస్థల ద్వారా రుణాలు ఇవ్వడంతో పాటు బ్యాంకుల రుణాల చెల్లింపుకు సంబంధించి ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం వరకు కొంత వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రిబేట్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ టాక్స్ అండ్ లేవిస్ పథకాన్ని మరింతగా విస్తరించాలని సూచించారు. ఈ పరిశ్రమ చేసే ఎగుమతులకు మరింత సహకారం అందించడంతో పాటు జీఎస్టీ పన్ను రీఫండ్ లను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. చేనేత పరిశ్రమను ఆదుకునేందుకు ఈ కష్టకాలంలో కనీసం 50 శాతం యార్న్ సబ్సిడీ ఇవ్వాలని, హ్యాండ్లూమ్ ఉత్పత్తుల పైన మొత్తం రెండు సంవత్సరాల పాటు జిఎస్టి ఎత్తివేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. దేశంలో ఈ పరిశ్రమను ఆదుకునేందుకు పత్తి రైతులకు నేరుగా సబ్సిడీలు అందించాలని సూచించారు. ఈ సంక్షోభ సమయంలో పరిశ్రమకు మరిన్ని అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా మంత్రి కేటీఆర్ పలు సలహాలు కేంద్రమంత్రికి ఇచ్చారు. పరిశ్రమ స్థాపించేందుకు ప్రధాన అడ్డంకులైనా వేజ్ కాస్ట్ మరియు పవర్ కాస్ట్ ల విషయంలో మద్దతు ఇవ్వాలని, గతంలో మాదిరి ఉద్యోగుల పీఎఫ్, ఈఎస్ఐ విషయంలో ప్రభుత్వం ఇచ్చే నిధుల సహకారాన్ని గతంలో మాదిరి కొనసాగించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ప్రకటించిన కార్పొరేట్ టాక్స్ తగ్గింపు మాదిరి మరిన్ని సంస్కరణలు ఈ పరిశ్రమలో తీసుకు వస్టే విదేశాల నుంచి పెద్దఎత్తున పెట్టుబడులు భారత దేశానికి వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కేటీఆర్ సూచించారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో కేంద్ర ప్రభుత్వంతో ఈ పరిశ్రమ అభివృద్ధికి కలిసి పని చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.