ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా మూడు రాష్ట్రాల పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోడీతో భేటీ కానున్నారు. రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధానితో కేసీఆర్ సమావేశం కావడం ఇదే తొలిసారి. సాయంత్రం 4గంటలకు లోక్ కల్యాణ్‌మార్గ్‌లోని ప్రధాని నివాసంలో మోడీని మర్యాదపూర్వకంగా కలవనున్నారు.
రాష్ట్ర్ర విభజన హామీలు, పెండింగ్ అంశాలు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా, రిజర్వేషన్ల పెంపు బిల్లు అంశాలపై సీఎం కేసీఆర్ ప్రధాని మోడీతో చర్చించనున్నారు. సచివాలయం, ఎక్స్ ప్రెస్ హైవేల నిర్మాణానికి రక్షణ శాఖ భూముల కేటాయింపుపై ప్రధానితో చర్చించనున్నట్లు సమాచారం.
ముఖ్యంగా హైకోర్టు విభజనకు వీలైనంత త్వరగా గెజిట్ విడుదలయ్యేలా చూడాలని కోరనున్నారు. అలాగే షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన, ఏపీ రాజధాని అమరావతికి తరలివెళ్లినందున హైదరాబాద్‌లో వారికి కేటాయించిన సచివాలయంలోని భవనాలతోపాటు, ఆయా హెచ్‌వోడీల కార్యాలయ భవనాలను తిరిగి అప్పగించాలని విజ్ఞప్తి చేయనున్నారు.