భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 60 లక్షలు దాటింది. గత 24 గంటల్లో దేశంలో 82,170 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 60,74,703కి చేరింది. దేశంలో కరోనా వైరస్ కేసులు ప్రతిరోజు అత్యధిక సంఖ్యలో నమోదవుతున్నప్పటికీ, అంతకంటే ఎక్కువగా బాధితులు కోలుకుంటున్నారు. ఇప్పటివరకు కరోనా బారినపడినవారిలో 50 లక్షలకు పైగా బాధితులు కోలుకున్నారు. గత 11 రోజుల్లో 10 లక్షల మంది కరోనా నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 74,893 మంది కోలుకున్నారని వెల్లడించింది. దీంతో కరోనాను జయించినవారి సంఖ్య 50,16,520కి చేరిందని తెలిపింది. దేశంలో గత కొన్నిరోజులుగా ప్రతిరోజు పెద్దమొత్తంలో అంటే 90 వేలకుపైగా బాధితులు మహమ్మారి బారినుంచి బయటపడుతున్నారని పేర్కొంది. గత 24 గంటల సమయంలో 1,039 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 95,542కి పెరిగింది. 9,62,640 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.