మరోసారి చావుదెబ్బ తిన్న పాక్…

97

భారత ఆర్మీ మరోసారి జూలు విదిల్చింది. పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్నిఉల్లంఘిస్తూ రక్తపాతం సృష్టిస్తున్న పాకిస్థాన్‌కు గట్టి సమాధానం ఇచ్చింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) వెంబడి ఉన్న నియంత్రణ రేఖకు అత్యంత చేరువకు వెళ్లిన భారత సైన్యం అక్కడి నుంచే పాకిస్థాన్‌ సైన్యానికి చెందిన నాలుగు అతి ముఖ్యమైన స్థావరాలను ధ్వంసం చేసింది. పాక్ ఆర్మీకి పీవోకేలో ఉన్న ఒక కీలకమైన కార్యాలయాన్ని పూర్తిగా నేలమట్టం చేసింది. ఈ దాడుల్లో కనీసం 40 మంది పాక్ సైనికులు మరణించినట్లు తెలుస్తోంది.

ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా మచ్చిల్‌ సెక్టార్‌లో ఇటీవల ఉగ్రవాదులు నియంత్రణ రేఖను దాటి వచ్చి భారత జవాను తల నరకడంలో కాల్పులతో సహకరించిన పాక్‌ దళాలపై.. ఈ దాడులతో సైన్యం ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. కుప్వారా జిల్లాలోని కెరణ్‌ సెక్టార్‌లో పాక్‌ బలగాలపై భారత సైన్యం గత నెల 29న తీవ్రంగా విరుచుకుపడింది. శతఘ్నుల సాయంతో జరిపిన ఈ దాడుల్లో నాలుగు పాక్‌ సైనిక శిబిరాలు, ఓ పటాలం ప్రధాన కార్యాలయం నేలమట్టమయ్యాయి.

Indian Army destroyed Pak posts across LoC

భారత జవాన్ మన్‌దీప్ సింగ్‌ తల వేరు చేసి దారుణంగా చంపేయడంపై రగిలిపోయిన ఇండియన్ ఆర్మీ ఈ తాజా దాడులు జరిపింది. సెప్టెంబర్ నెలలో భారత సైన్యం పీవోకేలోకి ప్రవేశించి చేపట్టిన సర్జికల్ దాడి తర్వాత తీవ్ర ఒత్తిడికి గురైన పాక్ సైన్యం భారత సరిహద్దుల వెంబడి ఉన్న గ్రామాలపై కాల్పులకు తెగబడ్డాయి. మహిళలు, చిన్నారులు, అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపాయి.

2003లో ఇరుదేశాలు కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు చేసిన నాటి నుంచి నియంత్రణ రేఖ వెంబడి శతఘ్నులను ఉపయోగించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. శతఘ్నుల వినియోగించిన విషయాన్ని అధికారవర్గాలు కూడా నిర్ధారించాయి. పాక్‌కు దీటైన జవాబు చెప్పేందుకుగాను నియంత్రణ రేఖ సమీపంలో శతఘ్నులను మోహరించామని.. ఇటీవలి దాడుల్లో వాటిని వినియోగించామని స్పష్టం చేశాయి. భారత్ జరిపిన తాజా దాడులు పాక్ ఆర్మీలో కలకలం రేపాయి.