తెలంగాణ బాటలోనే మరో ఏడు రాష్ట్రాలు..!

122
india lockdown

కరోనా నియంత్రణకు కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన లాక్ డౌన్ ఏప్రిల్ 14తో ముగుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఉంటుందా లేదా అనే సందేహం అందరిలో నెలకొంది. దీనికి తోడు దేశంలో కరోనాను నియంత్రించాలంటే లాక్ డౌన్ కొనసాగించడం తప్ప మరో మార్గం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కనీసం రెండు వారాలైనా లాక్ డౌన్‌ను పొడగించడం ద్వారా కరోనాను కట్టడి చేయవచ్చని ప్రధాని నరేంద్రమోడీని కోరారు సీఎం కేసీఆర్.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ బాటలోనే పయనించేందుకు మరో ఏడు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. మహారాష్ట్ర ( 891), తమిళనాడు (571), ఢిల్లీ (525) రాజస్తాన్‌ (323) కేరళ (295) ఉత్తరప్రదేశ్‌ (301), మధ్యప్రదేశ్‌ (230) లాక్ డౌన్ పొడిగించాలని కేంద్రాన్ని కోరనున్నట్లు సమాచారం.

ముంబై, పుణె రీజియన్లతోపాటు, మరికొన్ని హాట్‌స్పాట్లలో వచ్చే మంగళవారం తర్వాత కూడా లాక్‌డౌన్‌ కొనసాగించే అవకాశం ఉందని మహారాష్ట్ర ఆరోగ్యమంత్రి రాజేష్‌ తోప్‌ అన్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత అసోంకు రావాలనుకునే వారిని అడ్డుకుంటామని, శాశ్వత నివాసం ఏర్పర్చుకున్నవారికి కూడా కొంతకాలంపాటు ఐఎల్‌పీ (ఇన్నర్‌లైన్‌ పర్మిట్‌)వంటి పరిస్థితి అవసరమని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిశ్వా అన్నారు. దీంతో మొత్తంగా లాక్ డౌన్‌ని కొనసాగించేందుకే మెజార్టీ రాష్ట్రాలు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.