తమిళనాడు సీఎస్‌ ఇంటిపై ఐటీ దాడులు….

219
I-T raids on Tamil Nadu CS Ram Mohana Rao
- Advertisement -

తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహనరావు ఇంట్లో ఐటీ దాడులు జరిగాయి.సోమవారం తెల్లవారుజామున 5.30 గంటలకు మొదలైన దాడులు.. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రూ.వందల కోట్ల నగదును ఆయన బంగారంగా మార్చినట్లు ఆరోపణలు రావడంతో ఐటీ శాఖ సోదాలు చేస్తోంది. అన్నానగర్‌లోని ఆయన నివాసంతో పాటు మరో ఆరుచోట్ల కూడా ఈ దాడులు జరుగుతున్నాయి.

గత ఎన్నికల సమయంతో పాటు ఇటీవల నగదు మార్పిడి విషయాల్లో పలుమార్లు ఆయనపై ఐటీ అధికారులు కన్నేశారు. దివంగత ముఖ్యమంత్రి జయలలితతో పాటు శశికళ, ప్రస్తుత సీఎం పన్నీర్ సెల్వంకు కూడా ఆయన సన్నిహితుడని, వీళ్ల ఆర్థిక వ్యవహారాల్లో కూడా రామ్మోహనరావు కీలక పాత్ర పోషించారని సమాచారం. ఇటీవల ఐటీశాఖ దాడుల్లో బయటపడ్డ కాంట్రక్టర్‌ టీటీడీ మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డికి రామ్మోహన్‌రావు బంధువు.

 I-T raids on Tamil Nadu CS Ram Mohana Rao...

శేఖర్‌ రెడ్డి ఇంటిపై దాడులు జరిగిన తర్వాత మరికొంత మందిపై దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం కానీ ఏకంగా సీఎస్ ఇంటిపైనే దాడులు జరుగుతాయని ఎవరూ ఊహించలేకపోయారు. ప్రస్తుతం రామ్మోహనరావు ఇంట్లో రెండు బృందాలు, మిగిలినచోట్ల మరిన్ని బృందాలు తనిఖీలు చేస్తున్నాయి.

అన్నానగర్‌లోని అయ్యప్పన్ కోయిల్ సమీపంలో 17/184 డోర్‌ నంబరులో ఉన్న ఆయన ఇంటికి తొలుత సెక్షన్ 133 కింద విచారణ కోసం వెళ్లిన అధికారులు.. ఆ తర్వాత సమన్లు జారీచేసి, దాన్ని దాడులుగా మార్చారు. రామ్మోహనరావు, ఆయన కొడుకు, బంధువులు, సన్నిహితులకు చెన్నై, బెంగళూరు, చిత్తూరులలో ఉన్న 13 ఇళ్లలో సోదాలు జరిగాయి. ఆదాయపన్ను శాఖతో పాటు ఇతర శాఖలు అందించిన సమాచారం ఆధారంగానే సీఎస్ ఇంటి మీద ఆదాయపన్ను దాడులు జరిగినట్లు కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

 I-T raids on Tamil Nadu CS Ram Mohana Rao...

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై ఐటీ దాడులు జరగడం అంటే అది తమిళనాడు రాష్ట్రానికే అవమానమని డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ అన్నారు. తమిళనాడు చరిత్రలోనే ఇలా జరగడం ఇదే మొదటిసారని ఆయన చెప్పారు.

- Advertisement -