ప్రైవేట్ దవాఖానకు పోయి డబ్బులు వృథా చేసుకోవద్దు..

174
harish rao

సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకును సోమవారం మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ తమిళ్ అరసుతో కలిసి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో ఆక్సిజన్ అవసరాలు పెరిగాయి. హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు రావాలంటే.. వైద్య సిబ్బంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిని గమనించి శాశ్వత ప్రాతిపదికన సిద్దిపేట మెడికల్ కళాశాలకు లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకును తెప్పించినట్లు మంత్రి పేర్కొన్నారు. 24/7 ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 405 బెడ్స్ కోసం పని చేసేలా రూ.61 లక్షల వ్యయంతో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకును తెప్పించినట్లు మంత్రి తెలిపారు.

కరోనా లక్షణాలు తీవ్రంగా ఉంటే వెంటనే సిద్దిపేట కొవిడ్ దవాఖానకు రావాలి. ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు వైద్య బృందం సిద్ధంగా ఉందని మంత్రి హరీష్ రావు చెప్పారు. ప్రజలు అనవసరంగా ప్రైవేట్ దవాఖానకు పోయి డబ్బులు వృథా చేసుకోవద్దని మంత్రి కోరారు. సిద్దిపేటలో వంద పడకల కొవిడ్ దవాఖాన, మంచి డాక్టర్లు ఉన్నారు. అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుంటున్న సక్సెస్ రేట్ 99.4 శాతం చాలా ఎక్కువగా ఉందని, 0.6 శాతం మాత్రమే మృత్యువాత పడుతున్నారని మంత్రి పేర్కొన్నారు.