సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని మరోసారి నిరూపితమైంది. ఇప్పటికే రైతులకు ఉచిత ఎరువులు,ఎకరాకు 8 వేల పెట్టుబడి అందించేందుకు సిద్ధమైన సీఎం కేసీఆర్ తాజాగా మరో అడుగు ముందుకేశారు. రైతులకు రూ. 5 లక్షల ప్రమాద బీమా అమలు చేస్తామని ప్రకటించారు. రైతుకు అనారోగ్యం వచ్చినా.. అకాల మరణం పొందినా రూ. 5 లక్షల బీమా కల్పిస్తాం.. బీమాకు సంబంధించిన ప్రీమియం కూడా ప్రభుత్వం చెల్లిస్తుందని స్పష్టం చేశారు. 70 లక్షల మంది రైతులకు బీమా సదుపాయం అమలు చేస్తామని వెల్లడించారు.
అంతేగాదు మామిడి తోటలు సహా అన్ని పండ్ల తోటల రైతులకు కూడా పెట్టుబడి సాయం అందిస్తామని స్పష్టం చేశారు. ఎవరైనా పెట్టుబడి సాయం వదులుకున్న మొత్తాన్ని రైతు సమితి నిధికే కేటాయిస్తామని తెలిపారు. కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వలేము అని చెప్పారు. రైతుల హక్కులకు భంగం కలిగించవద్దన్నదే ప్రభుత్వ ఉద్దేశమని సీఎం అన్నారు. పామాయిల్ పంటలకు,గిరిజన రైతులకు కూడా పంట పెట్టుబడి సాయం అమలు చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.
కరీంనగర్ నుంచి ఏది మొదలు పెట్టినా విజయవంతం అవుతుంది కాబట్టే.. రైతులకు బీమా సదుపాయం ఇక్కడి నుంచి ప్రకటిస్తున్నానని సీఎం తెలిపారు. రైతులకు ప్రమాద బీమా చేయించడంలో రైతు సమన్వయ సమితులదే కీలకపాత్ర అని సీఎం చెప్పారు.