పేదల అభ్యున్నతే సీఎం కేసీఆర్ లక్ష్యం- మంత్రి కేటీఆర్‌

223
- Advertisement -

టీఆర్‌ఎస్ ప్రభుత్వం పైసా ఖర్చు లేకుండానే పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను కట్టిస్తోందని మంత్రి కేటీఆర్ చెప్పారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ పర్యటించారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని గొల్లపల్లి ఎల్లారెడ్డిపేట, రాచర్ల బొప్పాపూర్ గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆయన మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..పేద ప్రజల కోసం తెలంగాణ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో డబుల్ బెడ్‌ రూమ్ ఇళ్లను నిర్మించామని మంత్రి తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వమని.. పేద ప్రజల అభ్యున్నతే కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

నిరుపేదలకు ఎలాంటి అన్యాయం జరగకుండా, చాలా పారదర్శకంగా ఇళ్లను కేటాయిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. నిరుపేదల ముఖాల్లో సంతోషాన్ని చూడటమే తమ లక్ష్యమని అన్నారు. మన దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ మాదిరి డబుల్ బెడ్‌ రూమ్ ఇళ్లని కట్టించి ఇవ్వడం లేదని చెప్పారు. అలాగే త్వరలోనే అర్హులందరికీ పింఛన్లు, కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తామని తెలిపారు.

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించిన అనంతరం లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి. అనంతరం జిల్లా కేంద్రంలో రూ.1.50 కోట్లతో నిర్మించిన తెలంగాణ డయాగ్నోసిస్ సెంటర్‌ను మంత్రులు ప్రారంభించారు. డయాగ్నోసిస్ సెంటర్ ద్వారా 57 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్, ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పాల్గొన్నారు.

- Advertisement -