కన్నీటి పర్యంతమైన సీఎండీ ప్రభాకర్ రావు…

190
cmd prabhakar rao

శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో సహచర ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడం పట్ల జెన్ కో- ట్రాన్స్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాద సంఘటనకు సంబంధించి సమాచారం తెలుసుకున్న వెంటనే ప్రభాకర్ రావు అర్థరాత్రి సమయంలో హైదరాబాద్ నుంచి శ్రీశైలం బయలు దేరి వెళ్లారు.

ప్లాంటులో చిక్కుకున్న వారిని ఎలాగైనా ప్రాణాలతో బయటకు తీసుకురావడానికి విశ్వ ప్రయత్నం చేశారు. ఎన్.డి.ఆర్.ఎఫ్, సింగరేణి, ఫైర్, పోలీస్, వైద్య ఆరోగ్య తదితర శాఖలను రంగంలోకి దింపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డికి సమాచారం అందించారు. రాత్రంతా ప్లాంటు వద్దే ఉన్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఇంత చేసినా సహచరులను విగత జీవులుగా చూడాల్సి రావడంతో కన్నీటి పర్యంత మయ్యారు.

ఈ దురదృష్టకరమైన సంఘటన తనకెంతో బాధను, దుఃఖాన్ని కలిగిస్తున్నదని ప్రభాకర్ రావు చెప్పారు. తన సుదీర్ఘ అనుభవంలో ఇంతటి విషాద సంఘటన మరొకటి లేదని ఆయన చెప్పారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సహచరుల త్యాగం ఎన్నటికీ మరువలేనిదన్నారు. మంటలు ఎగిసి పడుతున్నప్పటికీ, ప్రాణాలకు ముప్పు అని తెలిసినప్పటికీ వారు ప్లాంటును కాపాడడానికి సాహసోపేత ప్రయత్నం చేసి అంకితభావం చాటుకున్నారని కొనియాడారు. విద్యుత్ ఉద్యోగులు జాతి సంపద కాపాడడం కోసం ప్రయత్నించి, వీర మరణం పొందారన్నారు.

ప్రజలకు నిరంతరం విద్యుత్ వెలుగులు అందించడానికి విద్యుత్ ఉద్యోగులు రేయింబవళ్లు, ప్రమాదరకరమైన పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తారనే విషయం ఈ దుర్ఘటన ద్వారా మరోసారి తేటతెల్లమయిందని చెప్పారు. యావత్ సమాజం విద్యుత్ ఉద్యోగులకు అండగా నిలవాలని అభ్యర్థించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వ పరంగా చేయాల్సిందంతా చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామి ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు ప్రకటించారు.