జమ్మి మొక్కను నాటిన సీఎం కేసీఆర్‌,చిన్నజీయర్ స్వామీజీ..

83
- Advertisement -

భక్తి అంటే భగవంతున్ని ప్రార్ధించడం మాత్రమే కాదు.. ఆ భగవంతుడు సృష్టించిన ఈ భూమిని కాపాడుకోవడం కూడా. అందుకే సకల చరాచర జీవరాశులకు వేదికైన ఈ నేలను, ప్రకృతిని కాపాడుకునే మహత్తర సంకల్పానికి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” వేదికగా నిలుస్తుంది. సామాన్యుల నుంచి సాధు పుంగవుల వరకూ ప్రతీ హృదయాన్ని కదిలిస్తుంది, చేయిపట్టి మొక్కలను నాటిస్తుంది.

ఈ క్రమంలోనే, ఈరోజు శంషాబాద్, శ్రీరామనగరంలోని జీవా ఆశ్రమంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామిజీ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుగారితో కలిసి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమంలో పాల్గొని జమ్మి మొక్కను నాటారు. అనంతరం చిన్నజీయర్ స్వామీజీ మాట్లాడుతూ.. “వృక్షో రక్షతి రక్షితా:” అన్నారు మన పెద్దలు. కానీ, ఆధునిక మానవుడు చెట్లను కొట్టేస్తూ..కొండలను తవ్వేస్తూ ప్రకృతిని విధ్వంసం చేస్తున్నాడు.

ఈ తరుణంలో మన భారతీయ సంస్కృతి భూమి గురించి, ప్రకృతి గురించి, సకల చరాచర జీవరాశుల గురించి ఎన్నెన్నో అద్భుతమైన ఉపదేశాలను అందించింది. వాటిని సదా ఆచరించింది. ముఖ్యంగా దైవం మీద ప్రేమ కలిగిన ప్రతీ వ్యక్తి ఏ రూపంలో దేవున్ని ప్రార్ధన చేసినా, ఆ దేవునికి సంబంధించి మన వేదాలు ఒక జంతువును, ఒక పక్షిని, చెట్టును వాటితో దేవుడికి ఉన్న అవినాభావ సంబంధాన్ని స్పష్టంగా వివరించాయి. విష్ణువు తో పాటు అశ్వద్ధామ, పక్షి గరస్మంతుడు, పామును, పరమ శివుడితో పాటు బిల్వపత్రం, నందిని అనుసంధానించారు. అంటే ప్రకృతితో మనిషి జీవం సాగించడానికి ప్రతీరూపంగా భగవంతుడు తన రూపాన్ని ఆవిష్కరించాడని చిన్నజీయర్ స్వామీజీ అన్నారు.

అంతేకాదు, మనమంతా “మానవసేవయే మాధవ సేవ అనుకోకుండా” మాధవ సేవ అనే భావనతో సర్వప్రాణి సేవ చేయాలన్నారు. మనిషి పుట్టినప్పుటి నుంచి కాటికి చేరేదాక చెట్టు జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని. అందుకే చెట్లల్లో నీడనిచ్చేవని, కాయలిచ్చేవని, పూలు ఇచ్చేవనే భావన లేకుండా అన్ని మొక్కల్ని పెంచాలి. ఈ భావనలు రాకుడదనే భగవంతుడు జమ్మి చెట్టును మన ఆలోచనలో భాగం చేశాడు. జమ్మి చెట్టును సాక్షాత్తూ లక్ష్మీదేవికి ప్రతీరూపంగా భావించేలా చేశాడు. భగవంతుడే జమ్మిచెట్టు దగ్గరకు వెళ్లి ఆరాధన చేసి, తమ ఆయుధాలను చెట్టుపై పెట్టి పూజించి మనకు పండగాలో చెట్టును భాగం చేశాడు. ఈ కారణంగానే పూర్వీకులు జమ్మిని రాణిగా పిలిచారని, దోషాలను శమీంప చేసేదిగా జమ్మికి ప్రాధాన్యత కల్పించారన్నారు.

అనాదిగా పూర్వీకులు మనకు అందించిన ఈ గొప్ప సదాశయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ద్వారా కోట్లాది మొక్కలను నాటించిన వారి కృషిని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. హైందవ సంప్రదాయంలో ప్రాధాన్యత కలిగిన జమ్మి చెట్టును జాతీయస్థాయిలో ఉద్యమంగా ముందుకు తీసుకుపోతున్న వారి ఆశయానికి ఆ శ్రీమన్నారయణమూర్తి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతేకాదు వారి భవిష్యత్ కార్యక్రమాలు దిగ్విజయం కావాలని ఆశిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను.

అనంతరం రాజ్యసభ సభ్యులు, “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ఆధ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ మాట్లాడతూ.. గురుతుల్యురు, సత్పురుషులు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామిజీ గారు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో భాగంగా మొక్కలు నాటడం మా పూర్వజన్మ సుకృతం. వారి ఆశీస్సులు మమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్తాయని ఆశిస్తున్నాం. అన్నారు. ఈ కార్యక్రమంలో కావేరి సీడ్స్ భాస్కర్ రావు, మై హోమ్స్ రామేశ్వర్ రావుతో పాటు ఆశ్రమానికి చెందిన స్వామిజీలు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” బాధ్యులు పాల్గొన్నారు.

- Advertisement -