జూన్ 8న మహాధర్నా:బీసీ జనసభ

18
- Advertisement -

స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్తే సెక్రటేరియట్ ను ముట్టడిస్తామని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం ఉదయం హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర బీసీ జనసభ ఆధ్వర్యంలో మెరుపు ధర్నా నిర్వహించారు. దీనితో కాసేపు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అడ్డుకోబోయిన పోలీసులతో ఆందోళనకారులు వాగ్వాదానికి దిగారు. దాదాపు 2 గంటలపాటు ధర్నా కార్యక్రమం కొనసాగింది.

ఈ సందర్భంగా రాజారాం యాదవ్ మాట్లాడుతూ..అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి విజయభేరీ సభలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేతుల మీదుగా ప్రకటించిన బీసీ డిక్లరేషన్ కు కాంగ్రెస్ కట్టుబడి ఉండాలని అన్నారు. కానీ..లోక్ సభ ఫలితాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని రాజారాం యాదవ్ ఆరోపించారు. ఇప్పటికే ఎన్నికల కమిషన్, అధికార యంత్రాంగానికి సీఎం ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కులగణన, సామాజిక న్యాయం పేరుతో అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందిన కాంగ్రెస్..మరోసారి బీసీలను మోసం చేసేందుకు సిద్ధమైందని విమర్శించారు. కులగణన చెయ్యకుండా, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఆగమేఘాల మీద స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏం ఉందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ఒక చిత్తు కాగితమేనా అని నిలదీశారు. అయినా ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమైతే.. జూన్ 8న ఇందిరాపార్కు దగ్గర వేలాది మందితో మహాధర్నా కార్యక్రమం చేస్తామని, అప్పుడు కూడా మొండిగా వెళ్ళితే.. జూన్ 15న సెక్రటేరియట్ ను దిగ్బంధనం చేయనున్నట్టు రాజారాం యాదవ్ ప్రకటించారు. దశాబ్దాల సామాజిక వర్గాల న్యాయమైన డిమాండ్ సాధన కోసం తెలంగాణ తరహాలో మరో పోరాటానికి అంతా సిద్ధం కావాలని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు కరుణాకర్ ముదిరాజ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అల్లంపల్లి రాంకోటి, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ్మూర్తి గౌడ్, టి.జర్నలిస్టుల ఫోరమ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల క్రిష్ణ, బీసీ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ ఎల్చాల దత్తాత్రేయ, ముదిరాజ్ యూత్ అధ్యక్షుడు రాజు ముదిరాజ్, నల్లగొండ జిల్లా యాదవ్ సంఘం అధ్యక్షుడు లొడంగి గోవర్ధన్ యాదవ్, పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్ నేత, బీసీ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డా.కర్నాటి శ్రీనివాస్, విద్యార్థి, నిరుద్యో సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కొంపెల్లి రాజుతోపాటు దాదాపు 200 మంది పాల్గొన్నారు.

Also Read:చేపలతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో!

- Advertisement -