ఆర్‌జీయూకేటీలో బోధన అధ్భుతం- వినోద్ కుమార్

19
b vinod kumar

బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలాజీస్‌లో సాగుతున్న విద్యా బోధన విధానం అధ్భుతంగా ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. గురువారం బాసర ఆర్. జీ.యు.కే.టీ. టీచింగ్ ఎంప్లాయిస్ సంఘం ప్రతినిధి బృందం వినోద్ కుమార్‌తో సమావేశమైంది. ఈ నేపథ్యంలో బాసర ఆర్.జీ.యూ.కే.టీ.లోని సంస్థాగత అంశాలను, అందులో ఏయే అంశాలపై బోధన సాగుతోంది వంటి పలు విషయాలను వినోద్ కుమార్ అడిగి తెలుసుకున్నారు.

బాసరలోని ఆర్.జీ.యూ.కే.టీ ఒక పూర్తి స్థాయి యూనివర్సిటీ లెవెల్‌లో బీటెక్‌లో సివిల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, కెమికల్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్, మెటారోలాజి ఇంజినీరింగ్, ఎంటెక్‌లో మెకానికల్, కంప్యూటర్ సైన్స్ ట్రేడ్ లలో బోధన కొనసాగుతుండటం గొప్ప విషయం అని వినోద్ కుమార్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ యూనివర్సిటీకీ అనుబంధంగా రాష్ట్రంలోని మరి కొన్ని ప్రాంతాల్లో కొత్త కాలేజీల ఏర్పాటుకు అవసరం ఉందని, అందుకు తన వంతుగా కృషి చేస్తానని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

టీచింగ్ ఎంప్లాయిస్ సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకుని వెళ్తానని ఆయన భరోసా ఇచ్చారు. బాసరలోని ఆర్.జీ.యూ.కే.టీ. స్థాయి ట్రిపుల్ ఐ.టీ. కన్నా గొప్పదని, ఆనవాయితీగా ట్రిపుల్ ఐ.టీ అని పిలుస్తున్నారని వినోద్ స్పష్టం చేశారు. ట్రిపుల్ ఐ.టీ. అంటే కేవలం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రేడ్ కోర్సులు మాత్రమే బోధించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. బాసర ఆర్.జీ.యూ.కే.టీ.లో పదవ తరగతి పాసైన విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించి ఇంటర్, ఇంజనీరింగ్ వరకు బోధనలు చేస్తున్నారని, గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు ఈ యూనివర్సిటీ ఒక వరం లాంటిదని ఆయన అన్నారు.

ఈ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులకు 90 శాతం మందికి ప్లేస్ మెంట్స్ లభిస్తున్నదని ఆయన తెలిపారు. వినోద్ కుమార్‌తో సమావేశమైన వారిలో బాసర ఆర్.జీ.యూ.కే. టీ. టీచింగ్ ఎంప్లాయిస్ సంఘం అధ్యక్షుడు టీ.శ్రీశైలం, ప్రధాన కార్యదర్శి డా ఏ. సాయి కృష్ణ, కార్యదర్శి కే. కృష్ణ ప్రసాద్, కోశాధికారి టీ. రాకేష్ రెడ్డి, ఈ.సీ. సభ్యులు డా ఎన్. విజయ్ కుమార్, డా హెచ్. దత్తు ఉన్నారు.