8న కరోనా వ్యాక్సినేషన్ డ్రై రన్..

49
Covid-19 vaccine dry run

జనవరి 8న దేశవ్యాప్తంగా రెండో దఫా కరోనా వ్యాక్సినేషన్ డ్రై రన్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ తెలిపారు. ఇందులో భాగంగా 33 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో 736 జిల్లాల్లో డ్రై రన్ జరగనుందన్నారు. ఈ రోజు అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జనవరి 8న చేపట్టే డ్రైరన్‌లో ఆసుపత్రి, బ్లాక్, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి డేటాను పరీక్షించనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. వ్యాక్సిన్ పంపిణీలో వచ్చే లోటుపాట్లు గుర్తించి, వాటిని అధిగమించేందుకు ఈ డ్రై రన్ ఉపయోగకరంగా ఉంటుందని స్పష్టం చేశారు. కో-విన్ యాప్ సాఫ్ట్‌వేర్ పనితనం గురించి రాష్ట్రాల మంత్రులకు వివరణ ఇచ్చారు. చివరి లబ్ధిదారుడి వరకు వ్యాక్సిన్ అందించేందుకు దేశవ్యాప్తంగా కోల్డ్ చైన్ విధానాన్ని మరింత పటిష్టం చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడించారు.

ఇప్పటికే భారత దేశం పోలియో, రూబెల్లా వంటి భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమాలు నిర్వహించిందని గుర్తు చేశారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్. భారీ ఎత్తున వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం మానవ వనరులను బలోపేతం చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియలో వివిధ స్థాయిలలో సిబ్బంది శిక్షణకు ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు. మెడికల్ ఆఫీసర్లు, వ్యాక్సినేటర్లు, ప్రత్యామ్నాయ వ్యాక్సినేటర్లు, కోల్డ్ చైన్ నిర్వాహకులు, పర్యవేక్షకులు, డేటా మేనేజర్లు, ఆశా సమన్వయకర్తలకు శిక్షణ ఇచ్చారు.

ఇక ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ పలు దఫాలుగా పరీక్షించినట్లు హర్షవర్ధన్ తెలిపారు. 2వ తేదీన జరిగిన డ్రై రన్‌లో కనుగొన్న లోపాలను సరిదిద్దుకొని జనవరి 8న జరిగే డ్రై రన్‌కు సిద్ధం కావాలని సూచించారు.గత డ్రై రన్‌కు సంబంధించి చాలా రాష్ట్రాలు సంతృప్తికర అభిప్రాయం అందించాయని.. వ్యక్తిగతంగా అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వ్యాక్సిన్‌పై ప్రజల్లో ఉన్న అపోహలను కూడా తొలగించేందుకు రాష్ట్ర మంత్రులు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కోరారు.