ఫేస్ బుక్‌తో ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్లను మాయ చేసి.. అంతర్జాలానికి అతుక్కుపోయేలా చేసిన మాంత్రికుడు మార్క్ జుకర్ బర్గ్. ఫేస్ బుక్ కు నెటిజెన్లనుంచి లభించిన అపూర్వ ఆదరణతో మార్క్‌జుకర్‌బర్గ్ ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతి సాధించడమే కాదు… అత్యంత సంపన్నుల్లో ఒకడిగానూ స్థానం సంపాదించారు.
జుకర్‌బర్గ్ కూతురు పుట్టినప్పటి నుండి ఎంతో ఆనందంగా ఉన్నాడు. తన చిన్నారి పాప మ్యాక్స్‌కు సంబంధించిన ప్రతి విషయాన్ని తన ఫేస్బుక్ ఖాతా ద్వారా తెలియజేస్తూనే ఉన్నాడు. తాజాగా జుకర్‌బర్గ్ ఇప్పుడు కుమార్తె తొలిపలుకులకు ముచ్చటపడుతూ ఆనందాన్ని ఫేస్బుక్లో పంచుకున్నారు. సుమారు ఏడాది వయసున్న తన బుజ్జాయి పలకడం మొదలుపెట్టేసిందంటూ తను తొలిసారి పలికిన పదమేంటో చెప్పారు.
సాధారణంగా పిల్లలు తొలి పలుకు.. మా.. మామ్.. డాడ్.. అనో పలుకుతారు. కానీ ఆ పాప అందుకు భిన్నంగా డాగ్ అని పలికిందట. జుకర్‌బర్గ్ ఇంట్లో వాళ్లు ఎంతో ఇష్టంగా పెంచుకునే బీస్ట్ అనే శునకం ఉంటుంది. జుకర్‌బర్గ్ పోస్ట్ చేసే చాలా ఫొటోల్లో ఈ శునకం కనిపిస్తుంది. తన కూతురుకు కూడా బీస్ట్ అంటే చాలా ఇష్టం అంటూ ఆయన తెగ ఆనందపడిపోతున్నారు. ‘మ్యాక్స్ లవ్స్ బీస్ట్. హర్ ఫస్ట్ వర్డ్: డాగ్’ అని చెప్తూ చిన్నారి మ్యాక్స్ బీస్ట్‌తో ఆడుకుంటున్న ఫొటోను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు జుకర్‌బర్గ్. ఈ ఫొటోకు లక్షల్లో లైక్‌లు, షేర్లు, వేలల్లో కామెంట్లు వస్తున్నాయి.
మార్క్ జుకర్‌బర్గ్, ప్రిసిల్లా చాన్ దంపతులకు 2015 నవంబర్ 30న మాక్స్ జన్మించింది. కూతురు పుట్టిన ఆనందంలో ఫేస్‌బుక్‌లోని 99శాతం వాటాలను (45బిలియన్ డాలర్లను/రూ. 30లక్షల కోట్లను) సామాజిక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు జుకర్‌బర్గ్ విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. చిన్న పిల్లల్లో వ్యాధుల నివారణకు ఉద్దేశించిన కార్యక్రమాలకు ఉదారంగా అందిస్తూ తన పెద్ద మనసును చాటుకుంటున్నాడు.