అంచనాలు నిలబెట్టుకుంటూ, ఆశలను నిజం చేసుకుంటూ ఆతిథ్య ఇంగ్లాండ్ తొలిసారి ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఆదివారం నరాలు తెగే ఉత్కంఠమధ్య అత్యంత రసవత్తరంగా సాగిన ఫైనల్లో ఇంగ్లాండ్ సూపర్ ఓవర్‌లో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. ముందు మ్యాచ్ టైగా ముగియడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. అయితే ఆశ్చర్యంగా సూపర్ ఓవర్ కూడా టై అయింది. ఈ క్రమంలో మ్యాచ్‌లో ఇంగ్లండ్ సాధించిన బౌండరీలు ఎక్కువగా ఉండడంతో ఐసీసీ నియమావళి ప్రకారం ఆ జట్టునే విజేతగా ప్రకటించారు.
మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. కివీస్ బ్యాట్స్‌మెన్లలో హెన్రీ నికోల్స్ (77 బంతుల్లో 55 పరుగులు, 4 ఫోర్లు), టామ్ లాథమ్ (56 బంతుల్లో 47 పరుగులు, 2 ఫోర్లు, 1 సిక్సర్)లు రాణించారు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, లియామ్ ప్లంకెట్‌లు చెరో 3 వికెట్లు తీయగా, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్‌లు చెరొక వికెట్ తీశారు.
అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ తడబడుతూ వచ్చింది. దీంతో ఆ జట్టు 50 ఓవర్లలో 241 పరుగులు చేసి ఆలౌట్ అయి న్యూజిలాండ్ స్కోరును సమం చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లలో బెన్ స్టోక్స్ (98 బంతుల్లో 84 పరుగులు, 5 ఫోర్లు, 2 సిక్సర్లు), జాస్ బట్లర్ (60 బంతుల్లో 59 పరుగులు, 6 ఫోర్లు)లు రాణించారు. కివీస్ బౌలర్లలో లాకీ ఫెర్గుసన్, జేమ్స్ నీషమ్‌లకు చెరో 3 వికెట్లు దక్కగా, మ్యాట్ హెన్రీ, కొలిన్ డి గ్రాండ్‌హోమ్‌లకు చెరొక వికెట్ దక్కింది.
10 జట్లు పాల్గొన్న ఈ వన్డే క్రికెట్ పోరాటంలో ఇంగ్లాండ్ జట్టు జగజ్జేతగా నిలిచింది. వన్డే క్రికెట్ చరిత్రలో ఇంగ్లాండ్ విజేతగా నిలవడం ఇదే ప్రథమం. 1979, 1987, 1992లో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్న ఇంగ్లాండ్ ఈసారి కప్ ఎగరేసుకెళ్లింది. కాగా, గతంతో పోలిస్తే ఈసారి ప్రపంచకప్ విజేతలకు భారీగా ప్రైజ్ మనీ పెంచారు. కప్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టుకు రూ.27.42 కోట్లు బహుమతిగా అందించారు. ఫైనల్లో ఓటమితో రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ జట్టుకు రూ.14 కోట్లు దక్కాయి. ఇక, సెమీస్ లో ఓడిన భారత్, ఆసీస్ లకు చెరో రూ.5.6 కోట్లు ముట్టజెప్పారు.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్తిల్ ఎల్బీ (బి) వోక్స్ 19; నికోల్స్ (బి) ప్లంకెట్ 55; విలియమ్సన్ (సి) బట్లర్ (బి) ప్లంకెట్ 30; టేలర్ ఎల్బీ (బి) వుడ్ 15; లేథమ్ (సి) విన్స్ (బి) వోక్స్ 47; నీషమ్ (సి) రూట్ (బి) ప్లంకెట్ 19; గ్రాండ్‌హోమ్ (సి) విన్స్ (బి) వోక్స్ 16; శాంట్నర్ నాటౌట్ 5; హెన్రీ (బి) ఆర్చర్ 4; బౌల్ట్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 30 మొత్తం: (50 ఓవర్లలో 8 వికెట్లకు) 241; వికెట్ల పతనం: 1-29, 2-103, 3-118, 4-141, 5-173, 6-219, 7-232, 8-240; బౌలింగ్: వోక్స్ 9-0-37-3; ఆర్చర్ 10-0-42-1; ప్లంకెట్ 10-0-42-3; వుడ్ 10-1-49-1; రషీద్ 8-0-39-0; స్టోక్స్ 3-0-20-0
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్: రాయ్ (సి) లేథమ్ (బి) హెన్రీ 17; బెయిర్‌స్టో (బి) ఫెర్గూసన్ 36; రూట్ (సి) లేథమ్ (బి) గ్రాండ్‌హోమ్ 7; మోర్గాన్ (సి) ఫెర్గూసన్ (బి) నీషమ్ 9; స్టోక్ నాటౌట్ 84; బట్లర్ (సి) సౌథీ (బి) ఫెర్గూసన్ 59; వోక్స్ (సి) లేథమ్ (బి) ఫెర్గూసన్ 2; ప్లంకెట్ (సి) బౌల్ట్ (బి) నీషమ్ 10; ఆర్చర్ (బి) నీషమ్ 0; రషీద్ రనౌట్ 0; వుడ్ రనౌట్ 0; ఎక్స్‌ట్రాలు 17 మొత్తం: (50 ఓవర్లలో ఆలౌట్) 241; వికెట్ల పతనం: 1-28, 2-59, 3-71, 4-86, 5-196, 6-203, 7-220, 8-227, 9-240; బౌలింగ్: బౌల్ట్ 10-0-67-0; హెన్రీ 10-2-40-1; గ్రాండ్‌హోమ్ 10-2-25-1; ఫెర్గూసన్ 10-0-50-3; నీషమ్ 7-0-43-3; శాంట్నర్ 3-0-11-0