బీజేపీని గద్దే దించడమే మా లక్ష్యం…

31
- Advertisement -

ఖమ్మం జిల్లాలో జరుగుతున్న బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభలో పంజాబ్ ఢిల్లీ కేరళ ముఖ్యమంత్రులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేరళ సీఎం పినరయి విజయన్‌ ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ సీంగ్‌ ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం అఖీలేశ్ యాదవ్ సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా పాల్గొన్నారు. ఆశేష జనవాహిని నడమ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ భవిష్యత్‌ కార్యచరణను ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ… బీజేపీని ఓడించడమే అందరి ముందున్న కర్తవ్యమని సీపీఐ నేత డీ రాజా అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధులకు నివాళుర్పిస్తూ…. తెలంగాణలో సుపరిపాలన అందుతోందని, సీఎం కేసీఆర్‌ను మనస్ఫూర్తిగా అభిస్తున్నానని తెలిపారు. విద్యుత్‌ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని, నిరంతర కరెంటు, శుభ్రమైన తాగునీరు అందుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. రైతుబంధు, దళితబంధు పథకాలు ఆదర్శనీయమన్నారు. దేశంలో లౌకికతత్వం ప్రమాదంలో పడిందన్న ఆయన.. భారత్‌ హిందూ దేశంగా మారే ప్రమాదం కనబడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశం అతిపెద్ద సంక్షోభంలో ఉందని, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయని మండిపడ్డారు

ఢిల్లీ సీఎం మాట్లాడుతూ… సీఎం కేసీఆర్‌ను పెద్దన్నగా సంబోధించారు. ఇవాళ రెండు గొప్ప కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు చెప్పారు. కంటి వెలుగు కార్యక్రమం, సమీకృత కలెక్టరేట్ల కాన్సెప్ట్‌ అద్భుతమని ప్రశంసించారు. కంటి పరీక్షలు ఉచితంగా అందించడం గొప్ప విషయం, ఈ కార్యక్రమాలను ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల్లోనూ అమలు చేస్తాం అని సీఎం కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. మేం ఒకరి నుంచి మరొకరం నేర్చుకుంటాం. ఢిల్లీ మొహల్లా క్లినిక్‌ మంచి ఫలితాన్నిస్తోంది. వాటిని చూసే సీఎం కేసీఆర్‌ ఇక్కడ బస్తీ దవాఖానాగా అమలు చేశారు.

బీజేపీ నియమించిన గవర్నర్లు సీఎంలను ఇబ్బంది పెడుతున్నారన్నారు. తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ, కేరళలో గవర్నర్లు ఏం చేస్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారు. అభివృద్ధి పనులకు అడ్డుతగలడమే గవర్నర్ల పని అన్నట్లుగా ఉంది. మన దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదకర స్థితిలో ఉంది. 2024 ఎన్నికల్లో దేశమంతా కలిసి బీజేపీని తరిమికొట్టాలి’ అని కేజ్రీవాల్‌ పిలుపునిచ్చారు.

పంజాబ్‌ సీఎం మాట్లాడుతూ…. ఈ దేశం రంగు రంగుల పూల స‌మాహారం అని, కానీ ఒకే పువ్వు ఉండాల‌ని కొంద‌రు చూస్తున్నార‌ని ఆయ‌న బీజేపీపై విమ‌ర్శ‌లు చేశారు. యువ‌త ఉద్యోగాలు ఆశిస్తున్నార‌ని, రెండు కోట్ల ఉద్యోగాలు ప్ర‌తి ఏడాది ఇస్తామ‌న్నార‌ని, కానీ అవ‌న్నీ జుమ్లాలుగా ఉండిపోయాయ‌న్నారు. ఖాతాలోకి 15 ల‌క్ష‌ల వ‌స్తాయ‌ని హామీ ఇచ్చారు కానీ, అది కూడా అబ్ధంగా నిలిచిపోయింద‌ని బీజేపీని విమ‌ర్శించారు.

పంజాబ్‌లోనూ తెలంగాణ ప్ర‌భుత్వం లాంటి ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెడుతామ‌న్నారు. మంచి ప‌నులు చూసి నేర్చుకోవాల‌న్నారు. ఇవి నాలెడ్జ్ షేరింగ్ రోజుల‌న్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన సీఎం కేసీఆర్‌కు ఆయ‌న ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. జిందా ర‌హేతో ఫిర్‌ మిలేంగే.. మిల్తే ర‌హేతో జిందా ర‌హీంగే అంటూ భ‌గ‌వంత్ మాన్ పిలుపునిచ్చారు.

కేరళ సీఎం పినరయి విజయన్‌ మాట్లాడుతూ… ఈ సందర్భంగా తెలంగాణ చేపడుతున్న అభివృద్ధిపై ప్రశంసలు కురిపించారు. ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ అనేక చర్యలు చేపడుతోందన్నారు. సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం అద్భుతంగా ఉందంటూ కితాబిచ్చారు. కంటి వెలుగు కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ప్రజలకు మద్దతుగా నిలుస్తోందని.. కేంద్రంపై పోరాడేందుకు కేసీఆర్‌ నడుం బిగించారని పినరయి విజయన్‌ అన్నారు.

దేశాన్ని కులం, మతం పేరుతో నిలువునా చీలుస్తున్నారు. మాతృభాషను చంపే ప్రయత్నంలో భాగంగానే రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తోంది. న్యాయ వ్యవస్థను కూడా ఛిన్నాభిన్నం చేస్తున్నారు. మోడీ పాలనలో ఫెడరల్‌ స్ఫూర్తి దెబ్బతింటోంది. రాజ్యాంగాన్ని కాపాడేందుకు బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలి. పార్టీలను ఏకతాటిపైకి తెచ్చినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు అని అన్నారు.

యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ మాట్లాడుతూ…. భార‌తీయ జ‌న‌తా పార్టీ కేవ‌లం భ్ర‌మ‌లు క‌ల్పిస్తుంద‌ని, ప్ర‌జ‌లంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌న్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌ట్టిన ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ నిర్మాణం .. ప్ర‌జాస‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారంగా నిలుస్తుంద‌న్నారు. ఖమ్మం స‌భ చ‌రిత్ర‌లో నిలిచిపోతుంద‌న్నారు. దేశంలోని అన్ని సంస్థ‌ల‌ను బీజేపీ నిర్వీర్యం చేస్తోంద‌ని ఆరోపించారు.

కేంద్రం ఢిల్లీలో కూర్చోని ఒక్కొక్క రాష్ట్రాన్ని నాశ‌నం చేయాల‌ని చూస్తోంద‌ని అఖిలేశ్ అన్నారు. తెలంగాణ‌లో మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కం అద్భుత‌మ‌ని అన్నారు. తెలంగాణ ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాల‌ను కేంద్రం కాపీ కొడుతోంద‌న్నారు. సీఎం కేసీఆర్‌కు ప్ర‌త్యేక అభినంద‌న‌లు తెలిపిన అఖిలేశ్‌.. ప్ర‌గ‌తిశీల నేత‌లు ఒక్క‌టి కావాల‌న్నారు.

ఇవి కూడా చదవండి….

మూడు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా…

రెండోవిడత కంటివెలుగు ప్రారంభం..

బీఆర్ఎస్ సభ..ఖమ్మంలో సర్వమత ప్రార్థన

- Advertisement -