నేడే ప్రగతి నివేదన సభ.. ఈ మహా సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎనిమిది రోజుల కిందటే వేదిక ఖరారు కాగా యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేశారు. అవుటర్ రింగ్‌రోడ్డును ఆనుకొని ఉన్న కొంగరకలాన్ గ్రామ స్వరూపాన్ని మార్చేశారు. భూములను చదును చేసి, వేదికను నిర్మించడంతో పాటు ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. ఎత్తయిన వేదికను నిర్మించారు. దీన్ని గులాబీ రంగుతో నింపేశారు. అక్కడి నుంచి ఎటూ చూసినా కిలోమీటరు దూరం వరకూ కనిపించేలా చేశారు. బారికేడ్లను అమర్చారు. భారీ ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేసి అందరూ వీక్షించేలా తయారుచేశారు.
మరికొద్ది గంటల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నిర్వహించే చారిత్రాత్మక సభకు కొంగరకలాన్, రావిర్యాల ప్రాంతాలు జాతరను తలపించేలా కనిపిస్తోంది. సభా ప్రాంగణం నుంచి ఎటు చూసినా కనుచూపు మేరలో అంతటా గులాబీరంగు పులుముకొన్నట్టుగా వుంది. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పథకాలపై ఏర్పాటుచేసిన పలు రకాల హోర్డింగులు ఆకర్షణీయంగా ఉన్నాయి.
ప్రగతి నివేదన సభ గురించి ఏప్రిల్ 27న ప్లీనరీ సందర్భంగా ప్రస్తావించిన సీఎం కేసీఆర్.. ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేసేందుకు వీలుగా సెప్టెంబరు నెలలో దానిని నిర్వహించేందుకు నిర్ణయించారు. నేతలు, కార్యకర్తలు, ప్రజల కోసం సర్వసౌకర్యాలు కల్పించారు. ప్రాంగణం, నగరమంతటినీ ముఖ్యమంత్రి కటౌట్లు, ఫ్లెక్సీలు, జెండాలు, బ్యానర్లతో అలంకరించారు. సభ నిర్వహణలో తెరాస సర్వశక్తులనూ మోహరించింది.
మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలో చకాచకా ఏర్పాట్లు జరిగాయి. మంత్రులు మహేందర్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, రంగారెడ్డి జిల్లా పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు వీటిల్లో పాల్గొన్నారు. అన్ని జిల్లాల్లో పార్టీ సన్నాహక సమావేశాలు ఏర్పాటుచేసి జనసమీకరణకు ప్రణాళిక రూపొందించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు ఇతర నేతలు సవాలుగా తీసుకొని జనసమీకరణలో పాల్గొన్నారు. సభకు పెద్దఎత్తున ట్రాక్టర్లలో రైతులను తరలించాలన్న కేసీఆర్ పిలుపు మేరకు 12 వేల ట్రాక్టర్లు సభకు పయనమయ్యాయి.
సభలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. జానపద, ఒగ్గు, గిరిజన, బుర్రకథ కళాకారులు రంజింపజేయనున్నారు. టీఆర్‌ఎస్ అభిమానులు, కార్యకర్తలు, నేతలు సభకు ఆదివారం ఉదయం నుంచే పెద్ద ఎత్తున చేరుకోనున్న నేపథ్యంలో వారిని వారికి కేటాయించిన సీట్లలో కూర్చోబెట్టేందుకు కళాకారులు ప్రభుత్వ పనితీరుపై, పథకాలు, అవి ప్రజలకు చేరుతున్న తీరుపై సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించనున్నారు. ఆదివారం 200 మంది కళాకారులతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ తెలిపారు.