ఒంటరిగానే బరిలోకి దిగుతాం..

259
KCR
- Advertisement -

తెలంగాణ‌ రాష్ట్రసమితి ఎన్నికలకు సిద్ధమైంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తాము సిద్ధమని ప్రకటించింది. ఏ రాజకీయ పార్టీతోనూ పొత్తులుండవని, ఒంటరిగానే బరిలోకి దిగుతామని స్పష్టం చేసింది. మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది తామేనని, 100 స్థానాల్లో విజయఢంకా మోగిస్తామని తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ దీమా వ్యక్తంచేశారు.

సోమవారం తెలంగాణ భవన్‌లోని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం టీఆర్‌ఎస్‌ భవన్‌లో నిర్వహించారు. సమావేశంలో ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే కంటి వెలుగు, రైతుబీమా, ఇతర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.

టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణపై కేంద్రం అనుసరిస్తున్న ధోరణిపై ముఖ్యమంత్రి మండిపడ్డారు. “నీతి అయోగ్ అసలు ఉద్దేశం వేరు.. కేంద్రం అనుసరిస్తున్న పద్ధతి వేరు. నీతి అయోగ్ పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంది. కాంగ్రెస్ పాలన మొఘల్ పాలకుల వలే ఉండేది. ప్రస్తుత బీజేపీ పాలన కూడా అలాగే ఉంది. బీసీలు, మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఇప్పటికే చాలా సార్లు కోరాం. ఇప్పుడు ఉన్న ఎంపీల సంఖ్య 33 కోట్ల జనాభా ఉన్నప్పుడు ఏర్పాటు చేసుకున్నది.

KCR

ఇప్పుడు పెరిగిన దేశ జనాభాకు అనుగుణంగా పార్లమెంటు స్థానాలు పెంచాలి. కేంద్రం సమాఖ్య విధానానికి తూట్లు పొడుస్తోంది. అధికార కేంద్రీకరణ చేస్తూ రాష్ర్టాలను మున్సిపాలిటీల్లాగా చూస్తున్నారు. రాష్ర్టాలకు మరింత స్వేచ్ఛ కావాలని గట్టిగా చెబుతున్నాం. వైద్యం, విద్య, వ్యవసాయం రాష్ర్టాన్ని బట్టి మారుతుంటాయి.

మోదీ ప్రభుత్వం చెబుతున్న మాటలకు, చేస్తున్న పనులకు పొంతన లేదు. ఈ మధ్య పేపర్లలో ఊహాగానాలు ఎక్కువవుతున్నాయి. వచ్చే ఎన్నికట్లో టీఆర్‌ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ పొత్తులు ఉండవు, ఇది పార్టీ ఏకగ్రీవ నిర్ణయం. సెప్టెంబరులోనే ఎన్నికల అభ్యర్థులను ప్రకటిస్తాం. మూడు నియోజకవర్గాలకు ఒకటి చొప్పున స్క్రీనింగ్ కమిటీలు ఏర్పాటు చేస్తాం..” అని సీఎం తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిసరాల్లో సెప్టెంబర్ 2న భారీ ఎత్తున ప్రగతి నివేదన సభను నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

- Advertisement -