తల్లిదండ్రులపై కేసు వేసిన హీరో విజయ్‌..

191
- Advertisement -

తమిళ సూపర్‌స్టార్, ఇలయ దళపతి విజయ్ విజయ్ తన తల్లిదండ్రులకి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారు. చెన్నైలోని ఓ లోకల్ కోర్టులో ఆయన సివిల్ కేసు వేశారు. విజయ్ తన తల్లిదండ్రులు సహా మొత్తం 11 మంది, ఇక పై తన పేరుని వాడుకోకుండా, కోర్టుని ఆశ్రయించారు. వారిలో విజయ్ తల్లిదండ్రుల పేర్లు కూడా ఉండటం గమనార్హం. సభలూ, సమావేశాలు పెట్టుకోవడానికి తన పేరు వాడుకుంటున్నారని తన పిటిషన్‌లో విజయ్ ఆరోపించారు. విజయ్‌కు తమిళ నాట విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేస్తారంటూ కొంతకాలంగా వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి పలుమార్లు తన అభిమానులతో విజయ్ చర్చలు జరిపారు కూడా.

ఈ నేపథ్యంలో విజయ్ ఫ్యాన్స్ కొంతమంది ఒక సొసైటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ఆలోచనకు విజయ్ తల్లిదండ్రులు కూడా అంగీకరించారు. విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ రిజిస్టర్ చేసిన ‘విజయ్ మక్కల్ మండ్రమ్’ సొసైటీ కార్యక్రమాల నుంచి విజయ్ దూరంగా ఉంటున్నారు. ఇంతటితో ఆగని విజయ్ తండ్రి ‘ఆలిండియా తలపతి విజయ్ మక్కల్ మండ్రమ్’ పేరుతో పార్టీని కూడా రిజిస్టర్ చేశారు. విజయ్ మక్కల్ మండ్రమ్ సంఘం సభ్యులు సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనికోసం విజయ్ పేరును వాడుకుంటున్నారు. అలాగే త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో వీళ్లంతా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయడానికి సమాయత్తమవుతున్నారు. ఇక ఈ కేసు సెప్టెంబర్ 27న విచారణకు రావచ్చంటున్నారు.

- Advertisement -