జూలైలోగా పంచాయ‌తీ ఎన్నిక‌లు..

197
nagireddy

జూలైలోగా పంచాయ‌తీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సిందేన‌ని స్ప‌ష్టంచేశారు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ నాగిరెడ్డి. పంచాయ‌తీ ఎన్నిక‌ల‌పై క‌లెక్ట‌ర్లు,ఎస్పీలు,అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించిన ఆయన పంచాయ‌తీ ఎన్నిక‌ల దృష్ట్యా రెండు నెల‌ల్లో ఎలాంటి కొత్త కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌వ‌ద్ద‌ని సూచించారు. ఎన్నిక‌లు పార‌ద‌ర్శ‌కంగా జ‌రిగేలా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాల‌న్నారు.

ఇప్పటికే ఓటర్ల తుది జాబితా సిద్ధమైందని అధికారుల‌కు తెలిపిన నాగిరెడ్డి .. ముద్రణా సామాగ్రి అంతా జూన్‌ 15కల్లా సిద్ధమవుతుందని తెలిపారు. బ్యాలెల్ పత్రాల ముద్రణ జిల్లాల్లోనే పూర్తి చేయాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు శాఖ చర్యలు చేపట్టాలని… అవసరమైతే ఇతర రాష్ర్టాల నుంచి బలగాలను తీసుకోవాలని సూచించారు. ప్రజలు స్వేచ్ఛగా ఎన్నుకునే అవకాశాన్ని యంత్రాంగం కల్పించాలని అధికారులకు చెప్పారు.

ఎన్నికల దృష్ట్యా పంచాయతీ కార్యదర్శుల బదిలీలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పంచాయతీ రాజ్‌ శాఖ కార్యదర్శి వికాస్‌రాజ్‌ తెలిపారు. ఎన్నికల తర్వాతే బదిలీలు ఉంటాయని….ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందిస్తామన్నారు.