తొలి రాష్ట్రంగా తెలంగాణ.. కేంద్రం ప్రశంసలు..

228
Telangana
- Advertisement -

దేశంలో అనేక రంగాల్లో ప్రథమ స్థానంలో నిలిచిన తెలంగాణ రాష్ట్రం మరో ఘనతను సొంతం చేసుకుంది. పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాల్లో 100 శాతం నల్లా కనెక్షన్లను పూర్తి చేసిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణను మొదటి రాష్ట్రంగా కేంద్రం ప్రకటించింది. దేశ వ్యాప్తంగా పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలు, ఆశ్రమాల్లో 100 శాతం న‌ల్లా కనెక్షన్ కల్పించాలని గతేడాది గాంధీ జయంతిని పురస్కరించుకొని 100 రోజుల ప్రణాళికను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు నల్లా కనెక్షన్‌ను అందించిన రాష్ట్రంగా నిలిచిందని కేంద్ర జల్‌జీవన్‌ మిషన్‌ స్వయంగా ప్రకటించి ప్రశంసించింది. 

రాష్ట్రవ్యాప్తంగా 22,882 ప్రభుత్వ పాఠశాలలకు, 27,310 అంగన్‌వాడీ కేంద్రాలకు మిషన్‌ భగీరథ నల్లా కనెక్షన్‌ ఇచ్చారు. గ్రామపంచాయతీ భవనాలకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కళాశాలలు, దేవాలయాలు, చర్చిలు, మసీదులకు కూడా నల్లా కనెక్షన్లను అందించారు. తద్వారా ప్రభుత్వ కార్యాలయా లు, విద్యాసంస్థలకు రక్షిత తాగునీరు అందుతున్నది. కేంద్రం లక్ష్యాన్ని కొన్ని రాష్ట్రాలే చేరుకోగలిగాయి. అందులో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది.నిర్ధిష్ట సమయంలో ఈ ప్రణాళికను తెలంగాణ‌, ఏపీ, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, గోవా, హర్యానా రాష్ట్రాల్లో పూర్తి చేసినట్టు కేంద్ర జలశక్తి శాఖ వివరాలను వెల్లడించింది. ఈ మిషన్ అమలుకు మరింత సమయం కావాలని పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సూచించాయి. రాష్ట్రాల సూచన మేరకు 100 రోజుల ప్రణాళిక ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం మార్చి 31 వరకు పొడిగించింది.

Minister Errabelli

ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మొదట్లో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా చేసిన మంత్రి కేటీఆర్ లకే ఈ క్రెడిట్ దక్కుతుందన్నారు. ఇప్పటికే అనేక అవార్డులు, రివార్డులు దక్కించుకున్న మిషన్ భగీరథ పథకం మరో ప్రశంసను పొందడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఆలోచన, ముందు చూపు వల్లే ఇది సాధ్యమైందన్నారు. అవార్డులు, ప్రశంసలతో పాటు కేంద్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకానికి నిధులు కూడా ఇవ్వాలని మంత్రి ఎర్రబెల్లి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -