ప్రమాదవశాత్తూ బోరు బావిలో పడిన ఏడాదిన్నర చిన్నారిని కాపాడేందుకు అధికార యంత్రాంగం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. గురువారం సాయంత్రం 7 గంటల సమయంలో పాప బోరు బావిలో పడిపోగా రాత్రి 8 గంటల నుంచి అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. సాంకేతిక సహాయంతో పాపను బయటకు తీయాలని రోబోటిక్ హ్యాండ్ క్లిప్, చైన్ పుల్లింగ్ టెక్నాలజీ ఉపయోగించినా ఫలితం లేకపోయింది. సింగరేణి నుంచి విపత్తు నివారణ బృందాలను రప్పించి వారి సహకారం తీసుకున్నప్పటికీ ప్రయత్నాలన్నీ విఫలయమ్యాయి. ముందుగా 37 అడుగుల లోతుకు చిన్నారి పడిపోయిందని గుర్తించిన అధికారులు బోరు మోటరు పైకి లాగిన తర్వాత 200 అడుగుల లోతులో కూరుకుపోయినట్లు నిర్ధరించారు.
శుక్రవారం కురిసిన వర్షం కారణంగా సహాయక చర్యలకు కాసేపు అంతరాయం ఏర్పడింది. మరోవైపు బోరుబావిలో పడిన చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు ఆధికార యంత్రాంగం, రెస్క్యుటీం బృందం తీవ్రంగా కృషి చేస్తోంది. ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, కలెక్టర్ రఘునందన్‌రావు, సైబరాబాద్ సీపీ సందీప్‌శాండిల్యా తో పాటు అన్ని శాఖ అధికారులు పరివేక్షణలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
సాంకేతిక పరిజ్ఞానంతో పాపను బయటకు తీయాలనే ప్రయత్నాలు విఫలం కావడం బాధాకర మని మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు చిన్నారి పరిస్థితిని తెలుసుకుం టున్నారని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు.